రెండు కార్లు గుద్దుకుంటే రెండిటికి డ్యామేజ్ జరుగుతుంది. కారు డివైడర్ ను గుద్దితే కారుకే డ్యామేజ్ జరుగుతుంది. అదే కారు మనిషిని లేదా ఏదైనా జంతువును గుద్దితే తీవ్రతను బట్టి గాయాలు అవ్వచ్చు లేదా ప్రాణాలే పోవచ్చు. అయితే, పెద్ద పులి కారును ఢీకొడితే ఎలా ఉంటుందో తెలుసా... దీంట్లో వింతేముంది, పులికి గాయలవుతాయి, కారుకు చిన్న చిన్న డ్యామేజెస్ అవుతాయి అంతే కదా అనుకుంటున్నారా. కాదు, పెద్దపులి గుద్దితే కారు బ్యానెట్ మొత్తం డ్యామేజ్ అవ్వడం చూశారా. అవును, నిజం.. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ యాక్సిడెంట్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం, కదిరినాయుడు పల్లె వద్ద వేగంగా వెళ్తున్న కారును పెద్ద పులి ఢీకొట్టింది.బద్వేలుకు చెందిన ఐదుగురు కారులో నెల్లూరు వెళ్తున్నారు. కదిరినాయుడుపల్లె అటవీ ప్రాంతంలో పెద్దపులి రోడ్డు దాటే క్రమంలో ఒక్కసారిగా కారును ఢీకొట్టింది. వేగంగా వస్తుండటంతో పులిని కారు కొంతదూరం పాటు ఈడ్చుకెళ్లింది.ఇంతలో డ్రైవర్ అలర్ట్ అయ్యి బ్రేక్ వేశాడు. కారు ఈడ్చుకెళ్లడంతో పెద్దపులి కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయిందని సమాచారం. కారులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా ఉన్నారు.