పంబాపూర్‌‌ అడవుల్లో పులి

పంబాపూర్‌‌ అడవుల్లో పులి
  • పాదముద్రలను గుర్తించిన ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు
  • ప్రజలు ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దని సూచన

తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. మూడు రోజులుగా పులి సంచరిస్తుండడంతో అటవీ ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాడ్వాయి మండలం పంబాపూర్‌‌ గ్రామ సమీపంలో గల అడవిలో బుధవారం రాత్రి పెద్దపులి సంచరించింది. ఎఫ్‌‌ఆర్‌‌వో సత్తయ్య బీట్ ఆఫీసర్లు, అటవీ శాఖ సిబ్బందితో కలిసి టీమ్‌‌లుగా ఏర్పడి అంబాపూర్ అడవుల్లో గాలించగా రాంపూర్‌‌ నార్త్‌‌ బీట్‌‌ పరిధిలో పులి అడుగులు కనిపించాయి. దీంతో నార్త్‌‌ రాంపూర్‌‌ సైడ్‌‌ ప్రజలు ఎవరూ వెళ్లొద్దని ఆఫీసర్లు సూచించారు. 

పొలాల వద్దకు గుంపులుగా మాత్రమే వెళ్లాలని, ప్రజలు, రైతులు, కూలీలు సాయంత్రం ఐదు గంటల్లోపు ఇండ్లకు చేరుకోవాలని సూచించారు. పులికి ఎలాంటి హాని కలిగించొద్దని హెచ్చరించారు. కాగా మూడు రోజుల క్రితం ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలోకి ప్రవేశించిన పెద్దపులి అదేరోజు చుంచుపల్లి వద్ద గోదావరి దాటి మంగపేట మండలంలోకి చేరింది. మరుసటి రోజు మంగపేట మండలం నుంచి పినపాక మండలం కిన్నెరసాని అడవుల వైపు వెళ్లినట్లు ప్రచారం జరిగింది. పినపాక మండలంలోని అడవుల నుంచి తిరిగి ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోకి చేరింది.