కూనవరంలో పులి కలకలం..నెల రోజులుగా ముప్పుతిప్పలు పెడుతున్న వైనం

కూనవరంలో పులి కలకలం..నెల రోజులుగా ముప్పుతిప్పలు పెడుతున్న వైనం
  • నెల రోజులుగా ముప్పుతిప్పలు పెడుతున్న వైనం
  • పశువులపై దాడులు.. ట్రాక్ కెమెరాలకూ చిక్కని పులి
  • బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్న ఆదివాసీలు

భద్రాచలం, వెలుగు : ఏపీలో కలిసిన కూనవరం మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. ట్రాక్ కెమెరాలకు సైతం చిక్కకుండా నెల రోజులుగా పశువులపై దాడులు చేస్తూ ఆదివాసీలు, ఆఫీసర్లను ముప్పుతిప్పలు పెడుతోంది. కూనవరం రేంజ్‌‌‌‌లోని మెట్ట రామారం, పాలదిన్నె, బోదునూరు, జిన్నెలగూడెం, దూగుట్ట, నర్సింగపేట గ్రామాలతో పాటు అడవిలోని కన్నాపురం, రామచంద్రాపురం, తాటిలంక గ్రామాల్లో తిరుగుతున్నట్లు తెలుస్తోంది. కూనవరం, చింతూరు మండలాల అటవీ ప్రాంతంలోని 60 కిలోమీటర్ల విస్తీర్ణంలో సంచరిస్తూ పశువులపై దాడులు చేస్తోంది. ఆఫీసర్లు పులి పాదముద్రలను పరిశీలించి 18 గోళ్లు, మూడు క్వింటాళ్ల బరువు, రెండు మీటర్ల పొడవు ఉంటుందని అంచనా వేశారు. 

పశువులపై వరుస దాడులు

కూనవరం, చింతూరు మండలాల్లో తిరుగుతున్న పులి వరుసగా పశువులపై దాడి చేస్తోంది. బోదునూరు గ్రామంలో ఇటీవల ఒక ఎద్దుపై దాడి చేసి ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేయగా గమనించిన తుష్టి జోగారావు అనే వ్యక్తి గట్టిగా అరిచాడు. ఎద్దుతో వాగు కాల్వను దాటలేక అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. అదే రోజు సాయంత్రం 4 గంటల టైంలో అదే గ్రామ సమీపంలోని అడవిలో మేస్తున్న పశువులపై దాడి చేసింది. పశువుల కాపరి సోడె శ్రీను పెద్దగా అరవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. అక్కడి నుంచి కన్నాపురం గ్రామ అడవుల్లోకి వెళ్లి మేకపై దాడి చేసి చంపింది. దీపావళి పండుగకు ముందు రోజు వీఆర్‌‌‌‌ పురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కారులో వస్తుండగా ఆర్కూరు– కూటూరు గ్రామాల మధ్య పులి కనిపించింది. దీంతో అతడు ఆఫీసర్లకు సమాచారం ఇవ్వగా ఆ రూట్‌‌‌‌లో రాకపోకలు నిలిపివేశారు. 

భయాందోళనలో ఆదివాసీలు

పులి జాడను కనుక్కునేందుకు పాదముద్రలు, పశువులను దాడి చేసిన ప్రాంతాల్లోని చెట్లకు అటవీశాఖ ఆఫీసర్లు ట్రాక్ కెమెరాలను అమర్చారు. కానీ ఇప్పటి వరకు ఏ కెమెరాలోనూ పులి జాడ కనిపించలేదు. నెల రోజులుగా కలకలం సృష్టిస్తుండడంతో ఆదివాసీలు అడవిలోకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. పులి బారి నుంచి పశువులను రక్షించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు కూనవరం – చింతూరు మధ్య రాత్రి టైంలో రాకపోకలు నిషేధించారు.