- సిర్పూర్(టి) రేంజ్ లోకి వచ్చి మహారాష్ట్రకు వెళ్తున్న టైగర్
- కదలికలపై నిరంతర నిఘా, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన
ఆసిఫాబాద్/ కాగజ్ నగర్, వెలుగు:‘హలో సార్.. హమారే తరఫ్ సే టైగర్ ఆప్కే ఇధర్ ఆరా, జర ధ్యాన్ రఖియే’ ఈ మాట నెల రోజులుగా తెలంగాణ, మహారాష్ట్ర ఫారెస్ట్ ఆఫీసర్ల మధ్య జరుగుతున్న రోజువారీ సంభాషణగా మారింది. ఉదయం లేస్తే పులి సంచారం, ట్రాకింగ్ ఇదే ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ల నిత్యకృత్యమైంది. తెల్లారితే, పొద్దుగూకితే పులి సంచారం, పశువుల మీద ఎటాక్ వార్తలు ఫారెస్ట్ వాళ్లకు ఒకింత ఇబ్బంది కలిగిస్తున్నాయి.
అయితే అడవికి అందం, గొప్పతనాన్ని చాటే పెద్దపులి సంచారం తాము పని చేస్తున్న ప్రాంతంలో ఉండడంపై ఫారెస్ట్ ఆఫీసర్లు, సిబ్బందిని ఆనందంలో ముంచెత్తుతోంది. ఇప్పుడు ఏ ఫారెస్ట్ ఆఫీసర్ ను కదిలించినా పులి తమకు రెగ్యులర్ ఎనిమల్ అని పొద్దున ఇటు.. సాయంత్రం అటు అని చెబుతున్నారు.
రాకపోకలకు మార్గం..
తెలంగాణ, మహారాష్ట్ర మధ్య సరిహద్దుగా ఉన్న కాగ జ్ నగర్ డివిజన్ సిర్పూర్(టి) రేంజ్ అటవీ ప్రాంతం పులి రాకపోకలకు మార్గంగా మారింది. పులి తోడు కోసం సాగుతున్న పయనంలో ఈ ప్రాంతం పులులకు అనువైన ప్రాంతంగా మారిందని ఫారెస్ట్ ఆఫీసర్లు భావిస్తున్నారు. మహారాష్ట్రలోని తాడోబా, అంధేరి టైగర్ రిజర్వ్ తో పాటు అడవిలో ఇటీవల పెరిగిన పులుల సంతతితో పులులు తిరుగుడు ఎక్కువైంది. మహారాష్ట్ర కు అనుసంధానంగా ఉన్న మాకిడి, ఇటికెల పహాడ్ అడవి గుండా పులులు రెగ్యులర్ గా సంచరిస్తున్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. దీంతో ఈ ప్రాంతంలో మరింత పకడ్బందీగా రక్షణ చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తున్నారు.
పెరిగిన ఇంటర్ స్టేట్ కో ఆర్డినేషన్..
గతంలో కన్నా ఇటీవల తెలంగాణ, మహారాష్ట్ర మధ్య పులి ట్రాకింగ్, ట్రేసింగ్ విషయంలో కో ఆర్డినేషన్ పెరిగింది. గతంలో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం ఉన్నప్పటికీ, దీనికి భిన్నంగా ఇటీవల పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ప్రతిరోజూ ట్రాకింగ్, ట్రేసింగ్ ఇప్పుడు అధికారులు, సిబ్బందికి చుక్కలు చూపిస్తోంది. పొద్దున తెలంగాణ అడవుల్లో కదలికలు గుర్తిస్తున్న అధికారులు, సాయంత్రానికి మహారాష్ట్రలోని అడవికి పయనమైన విషయాన్ని గుర్తించి అక్కడి ఆఫీసర్లకు సమాచారం ఇస్తున్నారు.
ఇదే సమయంలో పులి ఎలా వచ్చింది, మార్గంలో ఏదైనా పశువు, వన్యప్రాణి మీద ఎటాక్ చేసిందా? అనే విషయంపై ఆరా తీస్తున్నారు. కాగజ్ నగర్ డివిజన్ అధికారులతో పాటు మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా ఫారెస్ట్ లోని రాజురా, ధాబా, లాఠీ తదితర ప్రాంతాల అధికారులు అనునిత్యం పులి కదలికలపై మాట్లాడుతూ దానికి ఎటువంటి ప్రమాదం రాకుండా చూస్తున్నారు. ఇదే సమయంలో మనుషులకు హాని చేయకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. పులి కోసం బైనాక్యులర్ తో ట్రాకర్లు చూస్తుండడం పరిస్థితికి నిదర్శనంగా చెప్పవచ్చు.
మహారాష్ట్రలో కనర్గాం టైగర్ రిజర్వ్ ఏర్పాటు
ఇప్పటికే పులుల సంఖ్య పరంగా మహారాష్ట్రకు ప్రత్యేక స్థానం ఉంది. బార్డర్ లో ఉన్న కాగ జ్ నగర్ అడవికి సైతం దీంతో ప్రాధాన్యత వస్తోంది. ఈ మధ్య కాలంలో 30 నుంచి 35 పులులు పెరిగినట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు భావిస్తున్నారు. వేటగాళ్ల ముప్పు పొంచి ఉండడంతో ఈ విషయాన్ని బహిర్గతం చేసేందుకు రాష్ట్ర ఫారెస్ట్ ఆఫీసర్లు కొంత వెనకడుగు వేస్తున్నారు. ఇదే సమయంలో ఇప్పుడున్న తాడోబా టైగర్ రిజర్వ్ కు అదనంగా కనర్గాం ఫారెస్ట్ ను టైగర్ రిజర్వ్ గా మార్చేందుకు ప్రపోజల్స్ రెడీ చేస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.
ఇటీవల పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ సమక్షంలో జరిగిన ఇంటర్ స్టేట్ మీటింగ్ లో ఈ విషయాన్ని వివరించారు. ఈ ఫారెస్ట్ లో 7 నుంచి 9 పులులు ఉన్నట్లు గుర్తించామని, దీనిని రక్షిత ప్రాంతం చేసేందుకు ప్రపోజల్ రెడీ చేశామని పేర్కొన్నారు. ఈ ప్రాంతం తెలంగాణకు ఆనుకుని ఉండడం గమనార్హం. చప్రాడ వైల్డ్ లైఫ్ సెంచురీ ఇప్పటికే ఉండగా, దీనికి కనర్గాం టైగర్ రిజర్వ్ తోడైతే వార్దా, ప్రాణహిత నదీ తీరం పులికి శాశ్వత ఆవాసంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
పత్తి పంట చివరి దశకు రావడంతో సేఫ్..
ఇటీవల జరిగిన పులి దాడులన్నీ పత్తి చేలల్లోనే కావడంతో ఫారెస్ట్ ఆఫీసర్లు టెన్షన్ పడ్డారు. ఈ నెలలో పత్తి పంట 65 నుంచి75 శాతం ఇండ్లకు చేరడంతో ఫారెస్ట్ ఆఫీసర్లు ఊపిరి పీల్చుకుంటున్నారు. అటవీ ప్రాంతానికి దగ్గర్లోని భూముల్లో పత్తి పంట చేతికి రావడంతో టైగర్ ఎటాక్ టెన్షన్ కొంచెం తగ్గిందని అంటున్నారు. ఇప్పుడు ప్రజలు అడవిలోకి వెళ్లకుండా అవగాహన కల్పిస్తున్నారు.
కదలికలపై నిఘా పెట్టాం..
జిల్లాలో పులి సంచారం పెరగడంతో మహారాష్ట్ర అధికారులతో నిరంతరం సమాచారం ఇచ్చి పుచ్చుకుంటున్నాం. పులి కదలికలను పరిశీలించేందుకు సిబ్బంది 24 గంటలు ఫీల్డ్ లో ఉంటున్నారు. ఎక్కడ పులి దాడి జరిగినా, వెంటనే అక్కడకు చేరుకొని పరిహారం ఇవ్వడంతో పాటు జాగ్రత్తలు చెబుతున్నాం. పులి తనంత తానుగా మనుషులపై ఎటాక్ చేయదు. పులి సంచారంపై ఆందోళన వద్దు.– నీరజ్ కుమార్ టిబ్రేవాల్, డీఎఫ్ వో, ఆసిఫాబాద్