
కాగజ్ నగర్, వెలుగు : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ఫారెస్ట్ రేంజ్ లోని దరిగాం అటవీ ప్రాంతంలో చనిపోయిన పెద్దపులిని ఆడపులిగా అటవీ అధికారులు నిర్ధారించారు. ఆ పులి వయసు ఏడాదిన్నర ఉంటుందని, రెండు పులుల మధ్య ఘర్షణలో చనిపోయిందని ఆదిలాబాద్ ఫారెస్ట్ కన్జర్వేటర్ శాంతారాం వెల్లడించారు. కాగజ్ నగర్ లోని ఫారెస్ట్ డివిజన్ ఆఫీసులో జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్, ఎఫ్ డీఓ వేణుతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు.పులి మృతిపై శనివారం గ్రామస్తుల నుంచి సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించామని తెలిపారు.
కుళ్లిన స్థితిలో ఉన్న పులి మెడతో పాటు శరీరంపై పలు చోట్ల గాయాలను గుర్తించామని చెప్పారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రొటోకాల్ ప్రకారం కళేబరాన్ని పశువైద్య బృందంతో పంచనామా, పోస్ట్ మార్టం నిర్వహించి అక్కడే దహనం చేశామని పేర్కొన్నారు. 4 నుంచి 6 రోజుల క్రితం పులి మృతి చెందినట్లు భావిస్తున్నామని, మృతికి ముందు అదే ప్రాంతంలో ఓ పశువుపై పులి దాడి చేసిందని వివరించారు. పులి శరీర భాగాలను టెస్ట్ కోసం హైదరాబాద్ లోని ల్యాబ్ కి పంపించామని, రిపోర్టు ఆధారంగా పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. రెండు పులులు ఒకే ప్రాంతంలో ఎదురుపడినప్పుడు ఆధిపత్యం కోసం పోరాటం జరగడం సాధారణమేనని చెప్పారు.