- రాష్ట్రంలో తగ్గిన పులులు
- కవ్వాల్ రిజర్వ్, చెన్నూరులో ఒక్కటీ లేవ్
- ఒక్క అమ్రాబాద్ రిజర్వ్‌లోనే 21 పులులు.. ఎన్టీసీఏ రిపోర్ట్‌లో వెల్లడి
- మొత్తంగా 32 పులులు ఉన్నాయంటున్న మన రాష్ట్ర అధికారులు
- కవ్వాల్ కారిడార్‌లో 10, అమ్రాబాద్‌లో 22 ఉన్నాయంటూ వివరణ
రాష్ట్రంలోని ప్రధాన టైగర్ రిజర్వ్ ఏరియాల్లో పులులే లేకుండా పోయాయి. కవ్వాల్ రిజర్వ్, ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూర్ ‘కోర్’ప్రాంతాల్లో ఒక్క పులి కూడా లేదని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నివేదికలో వెల్లడైంది. రాష్ట్రంలో 2018లో 26 పులులు ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 21కి పడిపోయిందని తెలిపింది. ఉన్న ఆ పులులు కూడా ఒక్క అమ్రాబాద్ రిజర్వ్‌లోనే ఉన్నట్లు పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా 3,682 పులులు ఉన్నట్టు రిపోర్ట్ తెలిపింది. 2018లో ఈ సంఖ్య 2,967 మాత్రమే.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పులుల సంఖ్య తగ్గిపోతున్నది. ప్రధాన టైగర్ రిజర్వ్‌లలోని కోర్ ఏరియాల్లో అసలు పులులే లేకుండా పోయాయి. కవ్వాల్ రిజర్వ్, ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూర్ ‘కోర్’ప్రాంతాల్లో ఒక్క పులి కూడా లేదని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) తాజాగా విడుదల చేసిన ‘స్టేటస్ ఆఫ్ టైగర్స్ కో ప్రిడేటర్స్ అండ్ ప్రే’అనే నివేదికలో వెల్లడైంది. పులుల సంరక్షణపై ఎన్టీసీఏ ఇచ్చే మేనేజింగ్ ఎఫెక్టివ్‌నెస్ ఎవాల్యుయేషన్ (ఎంఈఈ) రిపోర్ట్‌లోనూ తెలంగాణ పూర్ రేటింగ్ సాధించింది. ఒక్క ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ తప్ప.. కవ్వాల్‌లో పులుల సంరక్షణ అంతంత మాత్రంగానే ఉన్నట్టు తేలింది. రాష్ట్రంలో 2018లో 26 పులులు ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 21కి పడిపోయిందని తెలిపింది. ఉన్న ఆ పులులు కూడా ఒక్క ఆమ్రాబాద్ రిజర్వ్‌లోనే ఉన్నట్లు పేర్కొంది. అయితే, దీనిపై మన రాష్ట్ర అధికారులు మాత్రం మరో వాదనను వినిపిస్తున్నారు. మరోవైపు రిపోర్ట్ ప్రకారం మనతో పోలిస్తే ఏపీ మెరుగైన స్థానంలో ఉంది. అక్కడి నాగార్జునసాగర్– శ్రీశైలం రిజర్వ్‌లో గతంలో 48 పులులు ఉంటే ఇప్పుడు 65కు పెరిగాయని రిపోర్ట్‌లో వెల్లడైంది. 2018లో పులుల సంరక్షణలో రెడ్‌జోన్‌లో ఉన్న ఏపీ.. ఇప్పుడు మంచి స్థానాన్ని నిలబెట్టుకున్నట్టు నివేదికలో తేలింది.
ఆమ్రాబాద్‌లో పెరిగినయ్..
ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో కోర్ ఏరియాలో గతంలో 11 పులులు ఉంటే, ఇప్పుడు వాటి సంఖ్య 19కి పెరిగింది. మొత్తంగా ఆ కారిడార్ పరిధిలో 21 పులులు ఉన్నాయి. అదే సమయంలో కవ్వాల్ కోర్‌లో ఒక్క పులి కూడా లేకుండా పోయింది. మన రాష్ట్ర అధికారులు మాత్రం కవ్వాల్ టైగర్ రిజర్వ్ కారిడార్‌లో దాదాపు 10 పులులు ఉన్నాయని చెబుతున్నారు. అయితే, వాటిని కేంద్ర అధికారులు పరిగణనలోకి తీసుకోలేదని చెబుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 32 పులులు ఉన్నాయని రాష్ట్ర అధికారులు పేర్కొంటున్నా.. ఎన్టీసీఏ రిపోర్ట్‌లో మాత్రం 21 పులులే ఉన్నాయని తెలిపింది. ఆమ్రాబాద్ రిజర్వ్‌కు ఎంఈఈ రిపోర్ట్‌లో 78.79 శాతం స్కోర్ రాగా, పులుల సంరక్షణలో 28వ స్థానంలో ఉంది. అదే కవ్వాల్ రిజర్వ్ 74.2 శాతం స్కోర్‌తో 34వ స్థానంలో నిలిచింది. ఇక, ఏపీలోని నాగార్జున సాగర్– శ్రీశైలం రిజర్వ్‌కు 82.5 శాతం స్కోరు సాధించగా, ఆ రిజర్వ్ 24వ స్థానంలో ఉంది.
దేశంలో 3,682 పులులు..
దేశవ్యాప్తంగా 3,682 పులులు ఉన్నట్టు ఎన్టీసీఏ రిపోర్ట్ పేర్కొంది. 2018లో 2,967 పులులు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 715 పెరిగినట్టు తెలిపింది. ప్రపం చంలోని మొత్తం పులుల్లో 75 శాతం మన దేశంలోనే ఉన్నట్టు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. 785 పులులతో మధ్యప్రదేశ్ తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వా త కర్నాటకలో 563 పులులు ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో 560, మహారాష్ట్రలో 444 ఉన్నాయి.
పులుల తగ్గుదలకు కారణమేంటి?
మన రాష్ట్రంతో పాటు ఏపీలోని శ్రీవెంకటేశ్వర నేషనల్ పార్క్, ఒడిశాలోని సత్కోషియా, మహారాష్ట్రలోని సహ్యాద్రిల్లోనూ కోర్ ఏరియాలో పులుల సంఖ్య దాదాపు అంతరించిపోయిందని ఎన్టీసీఏ రిపోర్ట్ వెల్లడించింది. అడవుల ఆక్రమణ, పులుల అక్రమ వేట, అడవి జంతువుల మధ్య సంఘర్షణ, అడవుల్లో పశువులను అక్రమంగా కాయడం, చెట్లను కొట్టేసి టింబర్ ప్రొడక్టులను తయారు చేయడం, టింబర్ సంస్థలు పుట్టుకురావడం, కార్చిచ్చులు, మైనింగ్, అడవుల్లో మౌలిక వసతుల కల్పనను పెంచడం వంటి కారణాల వల్ల పులులు కోర్ ఏరియాను వీడి దూరంగా వెళ్లిపోతున్నాయని రిపోర్ట్‌లో తేలింది. పులులకు ఆహారమైన జంతువులను వేటాడం వల్ల కూడా వాటి ప్రేలు తగ్గిపోయి, జనావాసాలపై పడుతున్నాయని వివరించింది.
ఇలాంటి వాటిని తగ్గించే చర్యలు చేపట్టి.. పులుల ప్రేలను పెంచితే వాటి సంఖ్య పెరిగే చాన్స్ ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి అక్కడ పులుల సంఖ్య పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగానే ఉన్నాయని తెలిపింది. కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో మనుషులు అడవులను ఆక్రమిస్తున్నారని, మానవ కార్యకలాపాలు పెరిగాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో వ్యవసాయం పెరగడం వల్ల నిత్యం జనాలపై పులులు దాడులు చేస్తున్నాయని చెప్తున్నారు.