
ముత్తారం, వెలుగు: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని అడవుల్లో నాలుగు రోజులుగా పులి సంచరిస్తోంది. 20 రోజుల కింద గోదావరి నదికి అవతల వైపు ఉన్న మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో సంచరించింది. అక్కడ నుంచి పది రోజుల కింద గోదావరి మీదుగా జయశంకర్ జిల్లా మలహర్ మండలం తాడిచర్ల గ్రామం వైపు వచ్చి ఆవుపై దాడి చేసింది.
అక్కడి నుంచి పెద్దపల్లి జిల్లాలోకి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. మూడు రోజులు కింద పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్ మండలం నుంచి ముత్తారం మండలం మచ్చుపేట గ్రామంలోని బగుల్లగుట్టలో తిరిగినట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు గుర్తించారు. అక్కడి నుంచి రామగిరి, కమాన్ పూర్, మంథని మండలాల్లో తిరిగినట్లు గుర్తించిన ఆఫీసర్లు, ఈ మూడు మండలాలను జల్లెడ పట్టినా జాడ దొరకలేదు.
ఈ నేపథ్యంలో సోమవారం మైదంబండ సమీపంలో మళ్లీ ఆనవాళ్లు కనిపించడంతో ఆందోళన చెందుతున్నారు. 2020లో ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్, మచ్చుపేట గ్రామాల్లో మగ పులి సంచరించి బగుల్లగుట్ట వద్ద ఆవుల మందపై దాడి చేసింది. ఇప్ప్పుడు వచ్చింది ఆడ పులిగా అడుగుల ఆధారంగా గుర్తించారు. ఇప్పటివరకు ఎలాంటి దాడులు చేయలేదని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.
బగుల్లగుట్టలో కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పులి ఎక్కువగా పంట పొలాల చుట్టూ తిరుగుతోందని రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముత్తారం, మంథని మండలాల్లో మానేరు పరివాహక ప్రాంతం, అటవీ ప్రాంతాల్లో పులి జాడ కోసం ట్రాకింగ్ టీమ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.