
కొడిమ్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో మంగళవారం పెద్ద పులి కనిపించినట్టు గ్రామస్తులు తెలిపారు. మంగళవారం ఉదయం గంగారం తండాకు చెందిన ఉపాధి హామీ కూలీలు రాజవ్వ, బోగిలు అటవీ ప్రాంత శివారులో ఉన్న నర్సరీలో మొక్కలకు నీరు పోయడానికి వెళ్లారు. పని చేస్తున్న క్రమంలో వీరికి పెద్ద పులి కనపడడంతో భయంతో గ్రామంలోకి పరుగులు తీశారు. ఈ క్రమంలో వీరు కింద పడిపోవడంతో గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు అటవీ ప్రాంతానికి వెళ్లి పెద్దపులి జాడలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు మాట్లాడుతూ.. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే అటవీ ప్రాంతానికి వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లాలని ఆ తర్వాత వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. రైతులు గుంపుగా వెళ్లి వ్యవసాయ పనులు చేసుకోవాలన్నారు. కొద్ది రోజులుగా మండలంలో పెద్దపులి తరుచూ కనిపిస్తుండటంతో మండల వ్యాప్తంగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సమస్యను పరిష్కరించాలని ఫారెస్ట్ అధికారులను కోరుతున్నారు.