- బెల్లంపల్లి మండలం కన్నాలలో సంచరించినట్లు గుర్తింపు
- ప్రజలు, పశువుల కాపర్లు అడవిలోకి వెళ్లవద్దని ఆఫీసర్లు సూచన
బెల్లంపల్లి, వెలుగు : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో పులి సంచరించడం కలకలం రేపింది. శుక్రవారం ఉదయం 8 గంటల టైంలో పులి పాదముద్రలను గుర్తించిన స్థానికులు అటవీశాఖ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. బెల్లంపల్లి రేంజ్ ఆఫీసర్ పూర్ణచందర్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు సతీశ్, ప్రవీణ్‌నాయక్, సిబ్బందితో కలిసి పులి సంచరించిన ప్రాంతానికి చేరుకున్నారు. కన్నాల పెద్దబుగ్గ ఆలయానికి వెళ్లే రోడ్డు దాటిన పెద్దపులి దట్టమైన అడవిలోకి వెళ్లినట్లు ఆఫీసర్లు పేర్కొన్నారు.
సమీపంలోని ఓ కుంట వద్ద పులి నీళ్లు తాగిన ఆనవాళ్లు ఉన్నాయన్నారు. పెద్దపులి సంచరించే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ పులి అసిఫాబాద్ జిల్లా తిర్యాణి అటవీ ప్రాంతం నుంచి వచ్చి ఉంటుందని, అది బీ2 పులి కావచ్చని అభిప్రాయపడ్డారు. పెద్దపులి సంచారం నేపథ్యంలో కన్నాల గ్రామ శివారు, పెద్దబుగ్గ ఆలయానికి వెళ్లే ప్రజలు, పశువుల కాపర్లు, కూలీలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు.
కన్నాల, లక్ష్మీపూర్, గొల్లగూడెం, బుగ్గగూడెం గ్రామాల ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లొద్దని చెప్పారు. పెద్దపులి సంచారం గుర్తించిన వెంటనే అటవీ శాఖ ఆఫీసర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పెద్దపులిని వేటాడేందుకు ఎవరైనా ప్రయత్నం చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.