అదిగో అడుగు.. ఇదిగో పులి .. బెల్లంపల్లి డివిజన్​లో బెబ్బులి కలకలం

అదిగో అడుగు.. ఇదిగో పులి .. బెల్లంపల్లి డివిజన్​లో బెబ్బులి కలకలం
  • సోషల్​మీడియాలో పుకార్లు 
  • వదంతులు నమ్మవద్దని ఫారెస్ట్​ఆఫీసర్ల రిక్వెస్ట్​

బెల్లంపల్లి రూరల్, వెలుగు: అదిగో పులి అంటే.. ఇదిగో అడుగులు అన్నట్లు బెల్లంపల్లి డివిజన్​లో టైగర్ సంచారం పుకార్లు శికారు చేస్తున్నాయి. డివిజన్​లో ఇటీవల పులి సంచారం నేపథ్యంలో సోషల్ మీడియాలో వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. పులి అక్కడ, ఇక్కడ పులి అంటూ వస్తున్న వార్తలు ప్రజలు, రైతులను కలవరపెడుతున్నాయి. బెల్లంపల్లి డివిజన్​లోని బెల్లంపల్లి మండలం కన్నాల ప్రాంతం నుంచి కాసిపేట మండలం బుగ్గగూడం వైపు పెద్ద పులి ఆనవాళ్లకు తోడు ప్రత్యక్షంగా తాము చూశామంటూ కొందరు పేర్కొంటున్నారు. దీంతో మొదట పెద్ద పులి పాదముద్రలను గుర్తించిన అధికారులు.. రెండు రోజుల క్రితం చిరుత పాదముద్రలు సైతం గుర్తించారు. దీంతో ఈ ప్రాంతంలో రెండు వన్యమృగాలు సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు ధ్రువీకరించారు. 

బయటకు వెళ్లేందుకు జంకుతున్న జనం

పులిని తాము అక్కడ చూశాం, ఇక్కడ కనిపించిందని కొందరు చెబుతుండడంతో డివిజన్​ గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒకటి కాదు రెండు పులులు తిరుగుతున్నాయని.. కాదు ఒక పులి, ఒక చిరుత అంటూ సోషల్​ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎక్కడో సంచరించే పులి ఫొటోలు వాట్సాప్​ గ్రూపుల్లో పెడుతూ.. సదరు ప్రాంతంతో రోడ్డు దాటున్న పులి అని పోస్ట్​ చేస్తున్నారు. దీంతో సాయంత్రమైతే రోడ్ల మీద వెళ్లేందుకు ప్రజలు, వాహనదారులు జంకుతున్నారు. పిల్లలను పాఠశాలలకు పంపేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారు. అత్యవసర పనులున్నా సాయంత్రం 5 గంటల తర్వాత బయటకు వెళ్లేందుకు సంకోచిస్తున్నారు. తాము పులిని చూశామని అధికారులకు ఫోన్లతోపాటు సోషల్​మీడియాలో పెడుతుండడంతో. అసలుకు, పుకార్లకు తేడాను నిర్ధారించడంలో ఫారెస్ట్​ ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. 

వదంతులు నమ్మొద్దు.. జాగ్రత్తలు పాటించండి

పులి విషయంలో వదంతులు నమ్మవద్దని నిజాలు నిర్ధారించుకునేందుకు ఫారెస్ట్​ ఆఫీసర్లను సంప్రదించాలని బెల్లంపల్లి ఫారెస్ట్ రేంజ్​ఆఫీసర్​పూర్ణచందర్​ కోరారు. సోషల్​ మీడియాలో వస్తున్న వదంతుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గతంలో ఇతర ప్రాంతాల్లో తిరిగిన పులుల ఫొటోలు వీడియోలను వాట్సాప్​ గ్రూపుల్లో పెడుతూ 
ఈ ప్రాంతంలో ఇప్పుడే కనిపించిందంటూ కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. అటువంటి వదంతులు నమ్మవద్దని ఇప్పటివరకు పులి, చిరుతలను పాదముద్రలను గుర్తించడం మినహా కెమెరాల్లో ఎక్కడా పులుల సంచారం రికార్డు కాలేదని పేర్కొన్నారు. 

సోషల్​ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని కోరారు. రాత్రి వేళ రోడ్ల మీద తిరగవద్దని, ద్విచక్ర వాహనాల మీద కూడా తిరగవద్దని సూచించారు. పులుల సంచారంపై, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పులికి హానిచేసేలా ఎవరూ వ్యవహరించవద్దని, పులి కదలికలు గుర్తిస్తే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. పొలాలకు వెళ్లేవారు గుంపులుగా శబ్దాలు చేసుకుంటూ వెళ్లాలని సూచించారు.