కొత్తగూడ, వెలుగు : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, వరంగల్ జిల్లా నర్సంపేట సరిహద్దులో వారం రోజులుగా పులి సంచారం కలకలం రేపుతోంది. తాజాగా కొత్తగూడ రేంజ్ పరిదిలోని ఓటాయి నార్త్ బీట్‌లో పులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ సిబ్బంది గుర్తించారు. దీంతో మహబూబాబాద్ డీఎఫ్‌వో విశాల్ శనివారం ఓటాయి నార్త్‌బీట్‌లో పర్యటించి పులి పాదముద్రలను పరిశీలించారు.
పులి ప్రస్తుతం రాంపూర్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో సంచరిస్తున్నట్లు నిర్ధారించారు. పులి పాదముద్రలను బట్టి కర్ణగండి మీదుగా పూనుగొండ్ల అడవిలో తిరుగుతున్నట్లు అభిప్రాయపడ్డారు. పరిసర గ్రామాల ప్రజలు అలర్ట్‌గా ఉండాలని, పులికి ఎలాంటి హానీ చేయొద్దని చెప్పారు. ఆయన వెంట ఎఫ్‌డీవో చంద్రశేఖర్, రేంజర్ వజహత్, డీఆర్‌వో కరుణ, ఎఫ్‌ఎస్‌వో రాజేశ్, మోహన్ ఉన్నారు.