
- ఎద్దును చంపిన పులి
- పులిని చంపితే కఠిన చర్యలు తప్పవని ఆఫీసర్ల హెచ్చరిక
పలిమెల, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండల ప్రజలకు టైగర్ టెన్షన్ పట్టుకుంది. సోమవారం ఉదయం అడవిలో మేతకు వెళ్లిన ఎద్దును పులి చంపేసింది. ఈ నెల మొదటి వారంలో మహారాష్ట్ర దాటి జిల్లాలోని ఎంటరైన పులి.. తూర్పు అటవీ ప్రాంతంలో కలియ తిరుగుతోంది. 11న మల్హర్ మండలం రుద్రారం, ఎడ్లపల్లి అటవీ ప్రాంతంలోని బొగ్గుల వాగు సమీపంలో పలువురి కంట పడింది. తాజాగా ఆదివారం పలిమెల మండలం ముకునూరు పరిసర ప్రాంతాల్లో ఫారెస్ట్ ఆఫీసర్లు పులి అడుగులను గుర్తించారు. సోమవారం తెల్లవారుజామున మండలంలోని ముకునూరు గ్రామంలో పూనెం రాంబాబుకు చెందిన ఎద్దు, పులి పంజాకు బలైంది. ఇదిలా ఉండగా మండలంలో పులులు రెండు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఆదివారం సాయంత్రం కిష్టపురం పహాడ్ మీదుగా పలిమెలకు వెళ్తున్న కొందరికి రెండు పులులు కనిపించాయని చెబుతున్నారు. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు.
టైగర్ కు హాని తలపెడితే కఠిన చర్యలు
జిల్లాలోకి ఎంటరైన టైగర్.. ప్రస్తుతం పలిమెల మండలంలోని సింగం పల్లి, కామన్పూర్, ముకునూరు అటవీ ప్రాంతంలో తిరుగుతోందని ఎఫ్ ఆర్ వో వెంకటేశ్వర్ రావు తెలిపారు. కొందరు వ్యక్తులు అడవిలో ఉచ్చులు వేసి, చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాంటి చట్ట వ్యతిరేక పనులు చేస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చీకటి పడిన తర్వాత ప్రజలు అటవీ ప్రాంతానికి వెళ్లకూడదని, పశువులను మేతకు పంపవద్దని సూచిస్తున్నారు.