అది ఆ నాలుగు పులుల్లోనిదేనా? .. కెమెరాకు చిక్కిన పులి!

  • అది ఆ నాలుగు పులుల్లోనిదేనా? కాదా? అనే దానిపై నో క్లారిటీ
  • ఫొటోపై తేదీ తప్పుగా ఉండడంతో అనుమానాలు 
  • అడవిలో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్ 


ఆసిఫాబాద్/కాగజ్​నగర్, వెలుగు: కాగజ్​నగర్ ఫారెస్టులో ఓ పులి కెమెరాకు చిక్కింది. అయితే అది అధికారులు వెతుకుతున్న నాలుగు పులుల్లోనిదేనా? కాదా అనే దానిపై క్లారిటీ లేదు. ఇటీవల కాగజ్​నగర్ అడవిలో విషప్రయోగం జరిగిన పశువు కళేబరం తిని రెండు పులులు చనిపోయాయి. ఇక్కడ రెండు పులులు తమ నాలుగు పిల్లలతో కలిసి ఆవాసం ఏర్పాటు చేసుకోగా.. అందులో రెండు మరణించాయి. మిగతా నాలుగింటి జాడ దొరకలేదు. విషప్రయోగం జరిగిన కళేబరాన్ని చనిపోయిన రెండు పులులతో కలిసి మరో పులి కూడా తిన్నట్టు కెమెరాల్లో రికార్డయింది. దీంతో మిగిలిన నాలుగు పులుల కోసం అధికారులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో శనివారం ఓ పులి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

కాగజ్ నగర్, సిర్పూర్ రేంజ్ ల బార్డర్ లోని మానిక్ పటార్ అడవిలో జంతు కళేబరాన్ని తింటున్న పులి ఫొటో బయటకు వచ్చింది. జంతు కళేబరంపై పులి నిలబడిన ఫొటో కెమెరాలో రికార్డయింది. అయితే ఈ కెమెరా ట్రాప్ పై 11/02/2024 అని తేదీ ఉండడం అయోమయానికి గురి చేస్తోంది. దీనిపై అధికారులను సంప్రదించగా ఎవరూ స్పందించడం లేదు. కెమెరాలో చిక్కిన పులి ఏది అన్నది క్లారిటీ ఇవ్వడం లేదు. పులి ఇమేజ్​లు కెమెరాల్లో రికార్డ్ అవుతున్నాయని, దాని అడుగులు కూడా గుర్తించామని.. అన్ని వివరాలు బయటకు చెప్పలేమంటూ అధికారులు దాటవేస్తున్నరు. మరోవైపు పులి ఫొటో విషయం తన దృష్టికి రాలేదని.. పులుల జాడ కోసం సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని కాగజ్ నగర్ ఎఫ్ డీవో వేణుబాబు తెలిపారు. కాగా, చింతలమానేపల్లి మండలం దిందా శివారులో పులి సంచరించినట్లు శనివారం కొందరు రైతులు  చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ ఆఫీసర్లు సూచించారు. 

పులుల కొట్లాట నిజమేనా?  

మొదట ఒక పులి కళేబరం దొరకగా, అది మరో పులితో జరిగిన కొట్లాటలో చనిపోయిందని అధికారులు ప్రకటించారు. అయితే ఆ తర్వాత రెండో పులి కళేబరం దొరకగా, అది విషప్రయోగం జరిగిన పశువు కళేబరం తిని చనిపోయినట్టు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో నిజంగా పులుల మధ్య కొట్లాట జరిగిందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అది నిజమే అయితే మొదటి పులితో జరిగిన కొట్లాటలో గాయపడిన మరో పులి ఎలా ఉందన్నది తేలాల్సి ఉంది. మరోవైపు టైగర్ ఫ్యామిలీలో మిగిలిన తల్లి పులి, మూడు పులుల జాడ దొరకాల్సి ఉంది.