
నాగర్ కర్నూల్, వెలుగు: నల్లమల ఫారెస్ట్పరిధిలోని కొల్లాపూర్ రేంజ్ లో పులుల సంఖ్య పెరిగింది. నల్లమల ఫారెస్ట్‌లో గత ఏడాది 21 పులులుండగాప్రస్తుతం వాటి సంఖ్య 30కి చేరింది. ఇందులో కొల్లాపూర్ రేంజ్‌లోనే 8 పులులున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇందులో ఒక మగ పులి, రెండు ఆడ పులులు, 5 పులి పిల్లలు ఉన్నాయి. రేంజ్లో చిరుతల సంఖ్య కూడా20కి చేరింది. రేంజ్‌పరిధిలోని ముక్కిడిగుండం, మొలచింతలపల్లి, నార్లాపూర్, చంద్రబండతాండా మండలాల పరిధిలో పులులు, చిరుతల సంచారం ఎక్కువగా ఉంది.
నల్లమల ఫారెస్ట్‌లో పులుల సంతతిని పెంచేందుకు రెండేళ్లుగా తీసుకుంటున్న చర్యలు ఫలితాలనిచ్చాయి. పులులు తిరిగే ప్రాంతాల్లో వాటర్ సాసర్స్ ఏర్పాటు చేయడం, ఆహారానికి కొరత రాకుండా చూడడం వల్ల పులుల, చిరుతల సంఖ్య పెరిగింది. కొల్లాపూర్రేంజ్ పరిధిలో దాదాపు 40, లింగాల రేంజ్లో 30 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పులుల లెక్క తేల్చారు. కొల్లాపూర్ రేంజ్ పరిధిలో 15 మంది రెగ్యులర్ సిబ్బందితో పాటు రెండు బేస్ క్యాంపుల్లో 15 మంది వాచర్లు పని చేస్తున్నారు. పులుల కదలికలు పెరగడంతో కొత్తగా మూడో బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. దీనికోసం ఐదుగురు చెంచు యువకులను వాచర్లుగా తీసుకున్నారు.
డీప్ ఫారెస్ట్‌లోనే పులుల సంచారం
పులులు, చిరుతల సంచారం డీప్ ఫారెస్ట్‌లోనే ఉంది. దీనివల్ల వాటి ఫుడ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎక్కడా మనుషులు, జంతువులపై దాడి చేసిన ఘటనలు లేవు. డీఎఫ్ఓ రోహిత్ గోపిడి చొరవ వల్ల రేంజ్‌పరిధిలో పులుల సంఖ్య పెరిగింది.
- శరత్ చంద్రారెడ్డి, ఎఫ్ఆర్వో, కొల్లాపూర్