
- అక్కడి నుంచే ఆదిలాబాద్‌జిల్లాకు రాకపోకలు
- సఫారీకి క్యూ కడ్తున్న పర్యాటకులు
- స్వేచ్ఛగా తిరుగుతున్న పులులను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నరు
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పులుల సంఖ్య పెరుగుతున్నది. ప్రస్తుతం ఈ రిజర్వ్ ఫారెస్టులో దాదాపు 25 పులులు ఉండగా, వీటిని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. పులుల సంఖ్య ఈ స్థాయిలో పెరిగేందుకు టీ 2 (తలాబ్వాలి) అనే ఆడ పులే కారణం. ఈ పులి గడిచిన ఆరేండ్లలో ఏకంగా10 పులులకు జన్మనిచ్చింది. తిప్పేశ్వర్ అడవుల్లోని పులులు స్వేచ్ఛగా తిరగడాన్ని పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. పర్యాటకుల కోసం మహారాష్ట్ర అటవీశాఖ ప్రతివారం 30 నుంచి 35 జీపుల్లో సఫారీ రైడ్‌కు అనుమతిస్తున్నది.
ఒక్కో జీపులో ఆరుగురు పర్యాటకులు ప్రయాణించవచ్చు. కాగా, గత ఆదివారం సాయంత్రం 28 జీపుల్లో వచ్చిన పర్యాటకులు సఫారీ చేస్తుండగా, దాదాపు 2 గంటల్లో ఏకంగా ఆరు పులులు కనిపించాయి. ఇందులో మూడు టీ2 ఆడపులి పిల్లలే కావడం విశేషం. ఆ పులులన్నీ అరగంటపాటు నీటిలో ఈదుతూ సందడి చేశాయి. జీపుల ముందు నుంచి వెళ్తున్న పులులను చూసి ఎంతో అనుభూతి పొందామని పలువురు పర్యాటకులు పేర్కొన్నారు.
పెన్‌గంగా నది దాటి ఆదిలాబాద్ జిల్లాలోకి..
మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అడవుల్లో ఉన్న పులులు పెన్‌గంగా నది దాటి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిపోతుంటాయి. ముఖ్యంగా తాంసీ, జైనథ్, పిప్ప ర్వాడ, బోరజ్ గ్రామాల సరిహద్దు అడవుల్లోకి తరచూ వస్తుంటాయి. స్థానికులకు రోజూ రెం డు, మూడు పులులు కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా చనాకా– కొరాటా బ్యారేజీ వద్ద గల పిప్పల్ కోటి రిజర్వాయర్ ప్రాంతానికి పులులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి.