పిప్పల్కోట రిజర్వాయర్లో కనిపించిన పులులు

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్ కోటి రిజర్వాయర్ సమీపంలో 4 పెద్దపులుల కనిపించాయి. అర్ధరాత్రి రిజర్వాయర్ వద్ద పనిచేస్తున్న డ్రైవర్లకు పెద్ద పులులు కనిపించేసరికి వాహనాన్ని ఆపి వాటిని ఫొటో తీశారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో పులులు సంచరించినట్లు కొందరు డ్రైవర్లు తెలిపారు. అవే మళ్లీ ఇప్పుడు తిరిగొచ్చినట్లుగా స్థానికులు భావిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఫారెస్టు అధికారులు పులుల ఆనవాళ్లు, జాడ కోసం వెతుకుతున్నారు. ఈ పులులు గతంలో వచ్చినవేనా లేదా వేరే పులులా అన్నదానిపై పరిశీలిస్తున్నట్లు డీఎఫ్ వో రాజశేఖర్ తెలిపారు. ప్రస్తుతం పెన్ గంగా నదిని దాటి మహారాష్ట్ర లోని టిప్పేశ్వర్ పులుల అభయారణ్యం నుండి ఈ పులులు వచ్చినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. గ్రామ శివారులో పులులు సంచరిస్తున్నాయన్న వార్త తెలిసేసరికి పిప్పల్ కోట, తాంసికే, గొల్లగడ్ సహా పరిసర ప్రాంతాలన్నీ భయాందోళనకు గురవుతున్నాయి.