చుట్టపు చూపుగా వచ్చిపోతున్నయ్!

చుట్టపు చూపుగా వచ్చిపోతున్నయ్!
  • తిప్పేశ్వర్, తాడోబా నుంచి కవ్వాల్ కు పెద్దపులుల రాక
  • సరైన ఆహారం, అవాసం లేక వచ్చిన దారిలో వెళ్తున్నయి
  • కోర్ ఏరియాలో మూడు తిరుగుతున్నయంటున్న ఆఫీసర్లు
  • కాగజ్ నగర్ కారిడార్​లో తొమ్మిది ఉన్నాయంటున్న అధికారులు
  • మేటింగ్ సీజన్ కావడంతో ఉమ్మడి జిల్లాలో పెరిగిన మూమెంట్

మంచిర్యాల, వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్​లోకి వచ్చిన పులులు అక్కడే ఆగడం లేదు. పక్కనే ఉన్న తిప్పేశ్వర్, తాడోబా టైగర్ రిజర్వుల నుంచి ఇట్ల వచ్చి అట్ల వెళ్లిపోతున్నాయి. ఇటీవల కవ్వాల్​లో కనిపించిన రెండు పెద్ద పులులు కూడా కోర్ ఏరియా దాటి బఫర్ జోన్​లోకి ఎంటరైనట్టు తెలుస్తున్నది. 

ఇవి ప్రస్తుతం ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల వైపు సాగుతున్నట్టు సమాచారం. ఈ పులులు తిరిగి కవ్వాల్ వైపు రావొచ్చని భావిస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లు వాటి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. అడవుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఎనిమల్ ట్రాకర్స్ ద్వారా టైగర్ మూమెంట్​ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని చెప్తున్నారు.

అన్నీ కాగజ్​నగర్ కారిడార్​లోనే... 

కాగజ్​నగర్ టైగర్ కారిడార్ పెద్దపులులకు ఆవాసంగా మారిందని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. తాడోబా నుంచి వలస వచ్చిన టైగర్స్ అక్కడి అడవుల్లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో పది నుంచి 12 పెద్దపులులు ఉన్నట్టు సమాచారం. వీటిలో రెండు ఫిమేల్​ కాగా, ఏడు మేల్ టైగర్స్ ఉన్నట్టు చెబుతున్నారు. వీటికితోడు మహారాష్ట్ర నుంచి మరో రెండు పులులు వచ్చాయి. 

కొత్తగా వచ్చిన మగ పులులకు ఇక్కడ ఆడ తోడు దొరికే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ పులులు ఇక్కడి అడవుల్లోనే కొంతకాలం ఉండే చాన్స్ ఉందంటున్నారు. ఆడ, మగ పులి కలిసి పిల్లల్ని కన్నాక ప్రస్తుతం అవి ఉంటున్న టెరిటరినీ వారసత్వంగా పిల్లలకు అప్పగించి అవి వేరే చోటుకు వెళ్లిపోతాయి. పిల్లలు పెరిగి, స్వయంగా వేట నేర్చుకునే వరకు వాటినే అంటిపెట్టుకొని ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

స్మెల్​తోనే గుర్తిస్తాయట

ఆడపులి అడవిలో తిరుగుతూ దాని శరీరం నుంచి ఒకరకమైన సెంట్​ను రిలీజ్ చేస్తుంది. ఆ స్మెల్​ను మగ పులులు వంద కిలోమీటర్ల దూరం నుంచి పసిగట్టి అటువైపు వస్తాయంటున్నారు. నిర్మల్, ఆదిలాబాద్​లో తిరిగిన జానీ అనే పెద్దపులి, మంచిర్యాలలో సంచరించిన ఎస్-12 పులి రెండూ ప్రస్తుతం ఆసిఫాబాద్ అడవుల వైపే వెళ్తున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన మగ పులి సైతం ఆసిఫాబాద్​లోని అడవుల్లోనే మకాం వేసినట్టు భావిస్తున్నారు.

కవ్వాల్​కు వచ్చి పోతున్నయ్

ఉమ్మడి జిల్లా అడవులు పెద్దపులుల ఆవాసానికి అనువుగా ఉన్నట్టు గుర్తించిన ప్రభుత్వం 2012లో కవ్వాల్ టైగర్ జోన్​ను ఏర్పాటు చేసింది. ఇక్కడ పులుల సంతతిని వృద్ధి చేసేందుకు ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది. కోర్​ ఏరియాలో శాకాహార జంతువుల సంఖ్యను పెంచి పులులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నది. గడ్డి మైదానాలు పెంచుతూ నీటి వసతి కోసం చిన్న చిన్న కుంటలను తవ్వుతున్నారు. 

దీంతో కవ్వాల్​ పరిధిలో జింకలు, దుప్పులు, కుందేళ్లు, సాంబార్, నీలుగాయి, అడవిపందులు, అడవిదున్నలు వంటి జంతువులు పెరుగుతున్నాయి. అయినప్పటికీ కవ్వాల్​కు వచ్చిన పెద్దపులులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం లేదు. వాటికి సరైన ఆవాసం, ఆహారం దొరక్కపోవడంతోనే వచ్చిన దారినే వెళ్తున్నాయని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఆడ పులులు సంతానాన్ని కంటేనే ఆ పిల్లలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే చాన్స్ ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు.

మేటింగ్ సీజన్​లోనే మూమెంట్

సాధారణంగా పెద్దపులులు ఒంటరిగానే తిరుగుతుంటాయి. కొన్ని చదరపు కిలోమీటర్ల పరిధిలో తమ సామ్రాజ్యం (టెరిటరీ) ఏర్పాటు చేసుకుని జీవిస్తాయి. ఒక పులి టెరిటరీలోకి మరో పులి రాదు. ఒకవేళ వస్తే రెండింటి మధ్య భీకరమైన పోరు జరుగుతుంది. అలాంటి టైగర్స్ చలికాలంలో మాత్రం జతగా ఉండేందుకు ఇష్టపడుతాయి. ఈ క్రమంలో తోడును వెతుక్కుంటూ వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం సాగిస్తుంటాయి.

 మేల్ టైగర్స్ తమ టెరిటరి హద్దులను దాటుకొని ఆడ తోడు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఫిమేల్ టైగర్స్ సైతం మగ తోడు కోసం సంచరిస్తుంటాయి. ఏటా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తాడోబా టైగర్ రిజర్వుల నుంచి కవ్వాల్ టైగర్ జోన్ వైపు వస్తుంటాయి.

అక్టోబర్ లో జానీ అనే పెద్దపులి తిప్పేశ్వర్ నుంచి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా అడవుల్లోకి వచ్చింది. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలోనూ పెద్దపులుల కదలికలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ రేంజ్ అడవుల్లో నెలన్నర రోజులుగా సంచరించిన ఎస్-12 అనే మగ పులి ఇటీవలే ఆసిఫాబాద్ జిల్లా తీర్యాణి అడవుల్లోకి వెళ్లింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని అడవుల్లో రెండు నుంచి మూడు మగ పులులు ఆడ పులి తోడు కోసం సంచరిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.