చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత : ఎస్పీ శరత్ చంద్ర పవార్

చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత : ఎస్పీ శరత్ చంద్ర పవార్

నార్కట్​పల్లి, వెలుగు : చెర్వుగట్టు పార్వతి జడల రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. ఆదివారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రతా ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 4 నుంచి 9 వరకు జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఐదుగురు డీఎస్పీ లు, 25 మంది సీఐలు,93 మంది ఎస్ఐలు, 186 మహిళా సిబ్బందితో కలిపి మొత్తం 900 మందితో  భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు.

బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు గుట్ట పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశామన్నారు. వాహనదారులు రోడ్డు పక్కన వాహనాలు ఆపి భక్తులకు అసౌకర్యం కలిగించవద్దని, కేటాయించిన స్థలంలో పార్కింగ్​ చేయాలని సూచించారు.  భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే వెంటనే  డయల్​100కు సమాచారం ఇవ్వాలని  తెలిపారు.