ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో అక్టోబర్ 12 న భారత్ బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల గురించి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు హైదారాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీపీలు, ఏసిపిలు, జిహెచ్ఎంసి, ఫైర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరగనున్న మ్యాచ్ నిర్వహణకు అవసరమైన అన్ని రకాల సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ పోటీలు నిర్వహించడం గొప్ప అవకాశం అని, ఎన్ని సవాళ్ళు ఎదురైనా తగిన విధంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు.
ALSO READ | IND vs BAN T20I: 150 కి.మీ వేగం వచ్చేస్తుంది: ప్రాక్టీస్‌లో మయాంక్ యాదవ్ కసరత్తులు
టికెట్ల పంపిణీలో ఎటువంటి గందరగోళం లేకుండా చూడాలని నిర్వహణ బృందానికి సూచించారు. ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అవసరమైన పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. సాధారణ వాహనదారుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా, ఉప్పల్ ప్రధాన రహదారి మీద ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
స్టేడియం పరిసరాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతీ ఒక్కరి కదలికలూ సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తం అవుతాయని పేర్కొన్నారు. నకిలీ టికెట్లు అమ్మేవారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని, టికెట్ల పంపిణీ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ఎటువంటి పుకార్లనూ నమ్మవద్దని తెలిపారు.