- విగ్రహాల ఏర్పాటు నుంచి నిమజ్జనం దాకా అలర్ట్ గా ఉండాలి
- రాచకొండ కమిషనరేట్ పరిధి పోలీసులతో సీపీ సుధీర్ బాబు
మల్కాజిగిరి, వెలుగు: గణేశ్నవరాత్రులు, నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, ఇతర అధికారులతో బుధవారం నేరేడ్ మెట్ లోని కమిషనరేట్ లో కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. నవరాత్రులకు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని ఆదేశించారు.
గణపతి విగ్రహాల ప్రతిష్టాపనలో నిర్వాహకులతో, అధికారులు ముందుగానే సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించాలని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ, అగ్నిమాపక, నీటి పారుదల, వైద్యశాఖ, విద్యుత్, రవాణా తదితర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాంతియుతంగా నిర్వహించుకునేలా చూడాలన్నారు. శాంతి భద్రతలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలన్నారు.
మండపాల్లో డీజే ఏర్పాటుకు అనుమతి లేదని, మండపం నిర్వహకులు, కమిటీలకు వివరించి చెప్పాలని సూచించారు. ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా పోలీసులతో పటిష్టమైన బందోబస్తు, నిమజ్జనోత్సవానికి అవసరమైన బందోబస్తు, స్విమ్మర్స్, క్రేన్స్, లైటింగ్స్, సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుపై సంబంధిత శాఖల సమన్వయంతో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పరిస్థితిని పర్యవేక్షించాలని చెప్పారు.
జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో ముందుగానే చెరువులు, ఇతర నిమజ్జన నీటి కుంటల వద్ద వీధి దీపాలు, క్రేన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. భక్తుల సౌకర్యార్థం గణేశ్ నిమజ్జనం జరిగే చెరువు కట్టల వద్ద టెంట్లు, లైట్లు, బారికేడ్లను నిర్మించాలని, మంచినీటి సౌకర్యం, మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు.