- హైదరాబాదీ ఆటకు ఫిదా అవుతున్న తోటి ప్లేయర్లు, మాజీలు
(వెలుగు స్పోర్ట్స్ డెస్క్) : ఠాకూర్ తిలక్ వర్మ. రెండేళ్ల కిందటి దాకా హైదరాబాద్ క్రికెట్‌లో మార్మోగిన పేరు. మొన్నటిదాకా ఐపీఎల్‌లో మార్మోగింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో తిలక్ పేరు వినిపిస్తోంది. డొమెస్టిక్ క్రికెట్‌లో మెరిసి.. ఐపీఎల్‌లో దంచికొట్టి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన హైదరాబాద్ యంగ్‌స్టర్ తిలక్ వెస్టిండీస్ గడ్డపై గర్జిస్తున్నాడు. తన తొలి ఇంటర్నేషనల్ సిరీస్‌లోనే పంజా విసురుతున్నాడు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ 39, 50, 49* స్కోర్లు చేసిన తిలక్ తన బ్యాట్ పవర్ చూపెట్టాడు. తోటి యంగ్‌స్టర్స్, పలువురు స్టార్ ప్లేయర్లు కరీబియన్ల బౌలింగ్‌లో ఇబ్బంది పడుతుంటే తిలక్ మాత్రం అలవోకగా షాట్లు కొడుతూ రన్స్ రాబడుతున్నాడు. మొత్తంగా 139 రన్స్‌తో ఈ సిరీస్‌లో అతనే టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ నిర్భయంగా షాట్లు కొడుతూ, పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేస్తున్న 20 ఏండ్ల తిలక్ ఆటపై ప్రశంసలు కురుస్తున్నాయి.
తిలక్‌కు మంచి ఫ్యూచర్ ఉందని తన బ్యాటింగ్ చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ఇదే జోరు కొనసాగిస్తే తిలక్‌కు తిరుగుండదనిపిస్తోంది. ప్రస్తుతం టీమిండియా లెఫ్టాండర్ బ్యాటర్ల కోసం చూస్తోంది. ముఖ్యంగా లోకేశ్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ గాయాలతో టీమ్‌కు దూరం అవ్వడంతో మిడిలార్డర్‌ను నడిపించే సత్తా ఉన్న ప్లేయర్ల కోసం వెతుకుతోంది. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో నాలుగో నంబర్‌లో వచ్చిన తిలక్ జట్టును ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నాడు. ఈ మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ సవాల్ విసిరిన వేర్వేరు పరిస్థితుల్లో సత్తా చాటాడు. తొలి పోరులో ఐదు ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయిన ఇండియా ఒత్తిడిలో పడగా.. వచ్చీరాగానే కౌంటర్ ఎటాక్ చేసిన తిలక్ విండీస్ బౌలర్లను వెనుకంజ వేసేలా చేశాడు. మరీ ముఖ్యంగా అల్జారీ జోసెఫ్ లాంటి నాణ్యమైన పేసర్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లతో ఖాతా తెరవడం అతని తెగువకు నిదర్శనం.
అలాగని అతను కేవలం హిట్టింగ్‌నే నమ్ముకోలేదు. రెండో టీ20లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ ఎంతో అనుభవం ఉన్న బ్యాటర్‌ను తలపించాడు. ఓపిగ్గా క్రీజులో నిలుచున్నాడు. వరుసగా వికెట్లు పడుతున్నా.. కీలక పార్ట్‌నర్‌షిప్స్‌తో టీమ్‌ను ఆదుకున్నాడు. గత పోరులో స్టార్టింగ్‌లో వేగంగా ఆడిన అతను మరో ఎండ్‌లో సూర్య కుమార్ భారీ షాట్లు కొట్టడంతో తాను కాస్త వెనక్కి తగ్గి స్ట్రయిక్ రొటేట్ చేసే బాధ్యత తీసుకున్నాడు. సూర్యకు సేచ్ఛగా ఆడే సపోర్ట్ ఇచ్చాడు. టీమ్ ప్లేయర్‌కు ఉండాల్సిన అసలైన లక్షణం ఇది. రాబోయే ఐర్లాండ్ టూర్‌తో పాటు ఆసియా గేమ్స్‌లో ఆడే జట్టులోనూ తిలక్ ఉన్నాడు. అక్కడ కూడా సత్తా చాటితే తిలక్ వన్డే వరల్డ్ కప్‌లో ఆడినా ఆశ్చర్య పోనక్కర్లేదు.
వరల్డ్ కప్ టీమ్‌లోకి తీసుకోవాలి: అశ్విన్
తిలక్ ఆటకు ఫిదా అయిన స్టార్ స్పిన్నర్ అశ్విన్ అతడిని వన్డే వరల్డ్ కప్ టీమ్‌లోకి తీసుకోవాలన్నాడు. పలువురు సీనియర్లు గాయాలతో జట్టుకు దూరం అయిన నేపథ్యంలో తిలక్ వస్తే మిడిలార్డర్‌లో సమస్యలు తీరుతాయని భావిస్తున్నాడు.‘వరల్డ్ కప్ టీమ్‌లో ప్లేస్ కోసం చాలా పోటీ ఉంది. అయితే, లెఫ్టాండర్ కావడం తిలక్ ప్లస్ పాయింట్. తిలక్‌ను ఇబ్బంది పెట్టే క్వాలిటీ ఆఫ్ స్పిన్నర్లు ప్రస్తుతం ఏ టాప్ టీమ్‌లోనూ లేరు. అందుకే వరల్డ్ కప్‌లో తను ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడు’ అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.