దుబాయ్: తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ, వరుణ్ చక్రవర్తి.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నారు. బుధవారం విడుదల చేసిన తాజా జాబితాలో తిలక్ ఒక్క ప్లేస్ ఎగబాకి రెండో ర్యాంక్‌లోకి దూసుకొచ్చాడు. దీంతో ఇండియన్ బ్యాటర్లలో అత్యధిక రేటింగ్ పాయింట్లు (832) సాధించిన నాలుగో ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. సూర్య, కోహ్లీ, రాహుల్ ముందున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో తిలక్ వరుసగా 19*, 72*, 18 రన్స్ చేయడం అతని ర్యాంక్ మెరుగుపడటానికి దోహదం చేసింది.
సూర్యకుమార్ యాదవ్ (763) నాలుగో ర్యాంక్‌లో ఉండగా, ట్రావిస్ హెడ్ (855), ఫిల్ సాల్ట్ (782), బట్లర్ (749) వరుసగా ఒకటి, మూడు, ఐదు ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. అభిషేక్ శర్మ 40వ ర్యాంక్‌ను సాధించాడు. బౌలింగ్‌లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (679) ఏకంగా 25 స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంక్‌లో నిలిచాడు. మూడో టీ20లో ఐదు వికెట్లు తీయడం వరుణ్‌కు కలిసొచ్చింది. అర్ష్‌దీప్ సింగ్ (664), రవి బిష్ణోయ్ (659), అక్షర్ పటేల్ (645) వరుసగా 9, 10, 11వ ర్యాంక్‌ల్లో ఉన్నారు. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా నంబర్‌వన్‌లోనే కొనసాగుతున్నాడు.