అరంగేట్రం సిరీస్లో నే అదరగొడుతున్న మన తెలుగోడు తిలక్ వర్మ. వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 సిరీస్లో పరుగుల వరద పారిస్తున్నాడు. తొలి టీ20లో ఆరంభం నుంచే విండీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ కీలకమైన 39 పరుగులు సాధించగా..రెండో టీ20లో ఏకంగా అర్థసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ హాఫ్ సెంచరీతో ఓ రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు.
తిలక్ వర్మ రికార్డు..
వెస్టిండీస్ తో జరిగిన రెండో టీ20లో 41 బంతుల్లో 51 పరుగులు చేసిన తిలక్ వర్మ.. టీ20ల్లో అత్యంత పిన్న వయసులోనే హాఫ్ సెంచరీ నమోదు చేసిన రెండో భారత క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. తిలక్ 20 ఏళ్ల 271 రోజుల వయసులో తొలి టీ20 అర్థ సెంచరీ సాధించాడు. అయితే ఈ జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 20 ఏళ్ల 143 రోజుల వయసులోనే అర్థ సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత తిలక్ వర్మ ఉన్నాడు. వీరిద్దరి తర్వాత రిషభ్ పంత్ 21 ఏళ్ల 38 రోజులు, రాబిన్ ఉతప్ప 21 ఏళ్ల 307 రోజులు, సురేశ్ రైనా 22 ఏళ్ల 90 రోజులతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
రెండో మ్యాచులోనూ ఓటమి..
తొలి టీ20లో ఓడిపోయిన టీమిండియా..రెండో టీ20లోనూ పరాజయం చవిచూసింది. రెండో మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు సాధించింది. తిలక్ వర్మ 41 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్స్‌తో 51 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 24 పరుగులు, ఇషాన్ కిషన్ 27 పరుగులతో రాణించారు. శుభ్‌మన్ గిల్(7), సూర్యకుమార్ యాదవ్(1), సంజూ శాంసన్(7) దారుణంగా విఫలమయ్యారు. వెస్టిండీస్ బౌలర్లలో అకీల హొస్సెన్, అల్జారీ జోసెఫ్, రొమారియో షెఫెర్డ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఆ తర్వాత 153 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన వెస్టిండీస్..18.5 ఓవర్లలో 155 పరుగులు చేసి విజయం సాధించింది. నికోలస్ పూరన్ 40 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67 అర్థ సెంచరీ కొట్టాడు. చివర్లో అకీల హోస్సెన్ 16 నాటౌట్ , అల్జారీ జోసెఫ్ 10 నాటౌట్ చివరి వరకు నిలిచి జట్టును గెలిపించారు. టీమిండియా బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టాడు. చాహల్ రెండు వికెట్లు సాధించాడు. అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్ తలో వికెట్ తీశారు.