- వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో మెప్పించిన తిలక్ వర్మ
- టీ20, వన్డేల్లో మిడిలార్డర్ బాధ్యతలకు సిద్ధంగా హైదరాబాదీ
వెలుగు స్పోర్ట్స్ డెస్క్ : వెస్టిండీస్ టూర్‌లో వైట్ బాల్ సిరీస్‌లను టీమిండియా ప్రయోగాలకు వేదికగా వాడుకుంది. వాటిలో చాలా వరకు బెడిసి కొట్టాయి. ఏడేండ్ల తర్వాత విండీస్ చేతిలో ఇండియా టీ20 సిరీస్ ఓడిపోయింది. అయితే, ఈ ప్రయోగాల్లో ఏకైక ఫలితంగా హైదరాబాదీ ఠాకూర్ తిలక్ వర్మ రూపంలో ఓ మొనగాడు జట్టుకు దొరికాడు. ఇరవై ఏండ్ల వయసులోనే ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన తిలక్ ఎదుర్కొన్న రెండో బాల్‌కే సిక్స్ కొట్టి.. బౌలింగ్‌లో వేసిన రెండో బాల్‌కే వికెట్ తీసి డ్రీమ్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి సిరీస్‌లోనే అన్ని మ్యాచ్‌ల్లో ఆడే చాన్స్ దక్కించుకున్న ఈ హైదరాబాదీ కోచ్, కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ టీమ్‌లో అందరికంటే ఎక్కువగా 173 రన్స్ చేశాడు.
అందులో ఓ ఫిఫ్టీ ఉండగా.. 141 స్ట్రయిక్ రేట్, యావరేజ్ 57.66తో ఆకట్టుకున్నాడు. విండీస్‌తో ఓ టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లీ (2019–--20లో 183 రన్స్) తర్వాత అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. బ్యాట్‌తో తన క్లాస్‌ని చూపెట్టిన తిలక్.. ఫీల్డింగ్‌లోనూ మెప్పించాడు. ఆఖరి టీ20లో తన బౌలింగ్ మెరుపులూ చూపెట్టి తనలో ఓ కంప్లీట్ ప్లేయర్ ఉన్నాడని చాటి చెప్పాడు.
నాలుగో నంబర్‌లో సరైనోడు
తన తొలి సిరీస్‌లో సూపర్ పెర్ఫామెన్స్‌తో వచ్చే ఏడాది జరిగే టీ2024 వరల్డ్‌కప్‌లో ప్లేస్‌కు తిలక్ బలమైన పునాది వేసుకున్నాడు. అయితే, అతని ఆట చూసిన తర్వాత రాబోయే ఆసియా కప్, వన్డే వరల్డ్‌కప్‌లో ఆడించాలని స్పిన్నర్ అశ్విన్, మాజీ క్రికెటర్ వసీం జాఫర్, మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అంటున్నారు. టీమిండియా వచ్చే నెలలో ఆసియా కప్, అక్టోబర్–నవంబర్‌లో సొంతగడ్డపై వన్డే వరల్డ్ కప్ ఆడనుంది. కానీ, తిలక్ ఇప్పటిదాకా వన్డే అరంగేట్రం చేయలేదు. తిలక్‌ను ఇప్పుడే వరల్డ్ కప్ టీమ్‌లో పరిగణనలోకి తీసుకోలేమని మొదట్లో అనుకున్నప్పటికీ.. విండీస్‌పై అతని ఆట సెలెక్టర్లను పునరాలోచనలో పడేసేలా చేసింది. అందుకు ప్రధాన కారణం వన్డే టీమ్‌లో మిడిలార్డర్ సమస్యనే. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ గాయాలతో జట్టుకు దూరం అవ్వడంతో విండీస్‌తో వన్డే సిరీస్‌లో సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్‌కు మేనేజ్‌మెంట్ ఆ బాధ్యతలు అప్పగించింది.
కానీ, వాళ్లు ఆకట్టుకోలేకపోయారు. అదే సమయంలో టీ20ల్లో నాలుగో నంబర్‌లో వచ్చిన తిలక్ మ్యాచ్ మ్యాచ్‌కూ ఎంతో పరిణతి చూపెట్టాడు. మ్యాచ్ పరిస్థితులు, జట్టు అవసరాలకు తగ్గట్టు ఆడగలనని నిరూపించుకున్నాడు. దాంతో, వన్డేల్లో టీమ్‌కు అతి పెద్ద సమస్యగా మారిన మిడిలార్డర్‌కు అతను పరిష్కారంగా కనిపిస్తున్నాడు. డైనమిక్ బ్యాటర్‌గానే కాకుండా మంచి ఫీల్డర్ కావడం తిలక్‌కు ప్లస్ పాయింట్. అన్నింటికీ తను లెఫ్టాండర్ బ్యాటర్. యాక్సిడెంట్‌కు గురైన రిషబ్ పంత్ ఇప్పట్లో తిరిగొచ్చేలా లేడు. ఈ నేపథ్యంలో ఆసియా కప్, వరల్డ్ కప్‌లో ప్రత్యర్థి లెఫ్టాండ్ స్పిన్నర్లను పక్కాగా ఎదుర్కొనే సత్తా తిలక్‌కు ఉందని భావిస్తున్నారు.
రైనా, యువీలా..
తనలో హిట్టర్ మాత్రమే కాకుండా మంచి ఆఫ్ స్పిన్నర్ కూడా ఉన్న విషయాన్ని తిలక్ ఐదో టీ20లో చూపెట్టాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తన రెండో బాల్‌కే నికోలస్ పూరన్ లాంటి హిట్టర్ వికెట్ తీశాడతను. తిలక్ డెలివరీ రివర్స్ స్వీప్ షాట్ ఆడాలని అనుకున్న పూరన్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో యువరాజ్ సింగ్, సురేశ్ రైనాతో పాటు సచిన్, సెహ్వాగ్ వంటి టాప్బ్యాటర్లు తమ పార్ట్ టైమ్ బౌలింగ్‌తో చిన్న చిన్న స్పెల్స్ వేసి టీమ్‌ను ఆదుకునేవాళ్లు.
ప్రస్తుత టీమ్ అన్ని విభాగాల్లో స్పెషలిస్ట్‌లు ఉన్నప్పటికీ అత్యవసరమైన సందర్భాల్లో బౌలింగ్ చేసి కీలక వికెట్లు తీసే బ్యాటర్లను మిస్ అవుతోంది. మళ్లీ ఇన్నాళ్లకు తిలక్ వర్మ రూపంలో అలాంటి క్రికెటర్ టీమ్‌కు అందుబాటులోకి వచ్చాడు. వన్డేల్లో తిలక్‌కు అవకాశం ఇస్తే మిడిలార్డర్ బలోపేతం అవ్వడంతో పాటు పార్ట్ టైమ్ స్పిన్నర్ఆప్షన్తో బౌలింగ్ బలం కూడా పెరగనుంది.