దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోందని, ఇప్పటి వరకు 160 కోట్ల డోసులకు పైగా వేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నెల 3న ప్రారంభించిన 15 నుంచి 18 ఏండ్ల లోపు పిల్లల్లో 52 శాతం మందికి ఫస్ట్ డోసు వ్యాక్సినేషన్ పూర్తియిందని తెలిపింది. అయితే 15 ఏండ్ల లోపు ఉన్న పిల్లల వ్యాక్సినేషన్‌పై ఇప్పటికే ట్రయల్స్ పూర్తయి అందుబాటులో ఉన్న సైంటిఫిక్ డేటాను పరిశీలించి, దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని వివరించింది. ఈ విషయాన్ని ఇవాళ ఢిల్లీలో ప్రెస్ మీట్ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా ఒక్కో ఏజ్ గ్రూప్‌కు వ్యాక్సినేషన్‌ను అందుబాటులోకి తెస్తున్నామని ఆయన చెప్పారు. 15 ఏళ్ల లోపు పిల్లల వ్యాక్సినేషన్‌పైనా అలానే నిర్ణయం తీసుకుంటామన్నారు.
As scientific evidence evolves, we will be expanding the coverage of vaccination. We will take decision on the basis of scientific data: Rajesh Bhushan, Health Secretary on COVID19 vaccination for those under 15 years of age
— ANI (@ANI) January 20, 2022
72 శాతం కేసులు.. వ్యాక్సిన్ వేయించుకున్నోళ్లే, కానీ
దేశవ్యాప్తంగా ఇవాళ 3 లక్షల 17 వేల 532 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని, వీటిలో 72 శాతం మంది రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిన వాళ్లే ఉన్నారని రాజేశ్ భూషణ్ చెప్పారు. గత ఏడాది ఏప్రిల్ 30న 3 లక్షల 86 వేల 452 కరోనా కేసులు నమోదయ్యాయని, ఆ రోజు 3059 మంది కరోనాకు బలయ్యారని, నాటి యాక్టివ్ కేసుల లోడ్ 31 లక్షలు ఉందని వివరించారు. అయితే ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 19 లక్షల 24 వేల 51 మాత్రమే ఉన్నాయని, ఒక్క రోజులో మరణాల సంఖ్య కూడా 380 నమోదయ్యాయని చెప్పారు. వ్యాక్సినేషన్ కారణంగానే ప్రస్తుతం వ్యాధి తీవ్రత, మరణాల సంఖ్య తక్కువగా ఉందన్నారు.