RCB vs PBKS: టిమ్ డేవిడ్ అరుదైన రికార్డ్.. ఈ సీజన్‌లో ఎవరికీ సాధ్యం కాలేదు

RCB vs PBKS: టిమ్ డేవిడ్ అరుదైన రికార్డ్.. ఈ సీజన్‌లో ఎవరికీ సాధ్యం కాలేదు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫినిషర్ టిమ్ డేవిడ్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో అదరగొడుతున్నాడు. ఎవరు ఆడినా ఆడకపోయినా ఈ ఆసీస్ స్టార్ జట్టులో నిలకడగా ఆడుతూ తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ ల్లో 160 కి పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి సూపర్ ఫామ్ లో ఉన్నాడు. శుక్రవారం (ఏప్రిల్ 18) చిన్న స్వామి వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒక్కడే హాఫ్ సెంచరీ చేసి ఆర్సీబీ పరువు కాపాడాడు. 26 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసి మ్యాచ్ మొత్తంలో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. ఒక దశలో 42 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 14 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో టిమ్ డేవిడ్ ఒక్కడే లోయర్ ఆర్డర్ తో కలిసి జట్టు స్కోర్ ను 95 పరుగులకు చేర్చాడు. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోయినా ఈ ఆసీస్ స్టార్ బ్యాటింగ్ అభిమానులని ఆకట్టుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు డేవిడ్ కు దక్కడం విశేషం. ఓడిపోయినా జట్టులోని ఆటగాడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకోవడం ఈ సీజన్ లో ఇదే తొలిసారి. 

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు మొత్తం మూడు అవార్డ్స్ డేవిడ్ గెలుచుకున్నాడు. సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్.. సూపర్ సిక్సస్ ఆఫ్ ది మ్యాచ్.. ఆన్ ది గో ఫోర్స్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. శుక్రవారం (ఏప్రిల్ 18) రాత్రి వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌‌లో ఆల్‌‌రౌండ్ పెర్ఫామెన్స్‌‌తో ఆకట్టుకున్న  పంజాబ్ కింగ్స్‌‌ 5  వికెట్ల తేడాతో ఆర్సీబీని ఓడించి ఐదో విజయం ఖాతాలో వేసుకుంది. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన పోరులో  టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన ఆర్సీబీ  95/9 స్కోరు చేసింది. అనంతరం పంజాబ్ 12.1 ఓవర్లలోనే 98/5 స్కోరు చేసి గెలిచింది.