NZ vs PAK: ఒకే ఓవర్‪లో నాలుగు సిక్సర్లు.. అఫ్రిదికి చుక్కలు చూపించిన కివీస్ ఓపెనర్

NZ vs PAK: ఒకే ఓవర్‪లో నాలుగు సిక్సర్లు..  అఫ్రిదికి చుక్కలు చూపించిన కివీస్ ఓపెనర్

పాకిస్థాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షహీన్ అఫ్రిదికి న్యూజిలాండ్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ పీడకలను మిగిల్చాడు. మంగళవారం (మార్చి 18) డునెడిన్ వేదికగా యూనివర్సిటీ ఓవల్ లో జరిగిన రెండో టీ20 లో అఫ్రిది ఓవర్ లో ఏకంగా నాలుగు సిక్సర్లు బాదాడు. వీటిలో ఒకటి 119 మీటర్ల సిక్సర్ కావడం మ్యాచ్ కే హైలెట్ గా మారింది.   కొత్త బంతితో పవర్ ప్లే లో అతను ఈ సిక్సర్లను కొట్టడం విశేషం. ఇన్నింగ్స్ మూడో ఓవర్ లో తొలి రెండు బంతులకు సిక్సర్లు కొట్టిన ఈ కివీస్ ఓపెనర్.. చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. దీంతో ఈ ఓవర్ లో మొత్తం 26 పరుగులు వచ్చాయి.

షహీన్ వేసిన తొలి ఓవర్ ను సీఫెర్ట్ మెయిడిన్ ఓవర్ ఆడాడు. అయితే మూడో ఓవర్ లో విశ్వరూపం చూపించి 26 పరుగులు రాబట్టాడు. అంతకముందు ఫిన్ అలెన్ మహమ్మద్ అలీ బౌలింగ్ లో మూడు సిక్సర్లు బాదడంతో కేవలం రెండు ఓవర్లలోనే న్యూజిలాండ్ 44 పరుగులు చేసి మ్యాచ్ తమ వైపుకు తిప్పుకుంది. ఓపెనర్ల జోరుతో న్యూజిలాండ్ మరో 11 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో 136 పరుగుల లక్ష్యాన్ని 13.1 ఓవర్లలో ఛేజ్ చేసింది. 

Also Read:-మా టైమ్ వస్తుంది.. వరుసగా ఐదు ఐపీఎల్ టైటిల్స్ కొడతాం..

టాస్ ఓడి మొదట బ్యాటింగ్  చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 15 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. సల్మాన్ ఆఘా 46 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. షాదాబ్ ఖాన్ (26), షహీన్ అఫ్రిది (22) రాణించారు. లక్ష్య ఛేదనలో సీఫెర్ట్ (45), ఫిన్ అలెన్ (38) చెలరేగడంతో 13.1 ఓవర్లలో 137 పరుగులు చేసి గెలిచింది. ఈ విజయంతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో న్యూజిలాండ్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 శుక్రవారం (మార్చి 21) జరుగుతుంది.