T20 World Cup 2024: ఉగాండాపై సౌథీ పంజా.. వరల్డ్ కప్ చరిత్రలో ఆల్‌టైం రికార్డ్

T20 World Cup 2024: ఉగాండాపై సౌథీ పంజా.. వరల్డ్ కప్ చరిత్రలో ఆల్‌టైం రికార్డ్

వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్ వెటరన్ పేసర్ టీమ్ సౌథీ నిప్పులు చెరిగాడు. పసికూన ఉగాండాపై పంజా విసరి ఆల్ టైం రికార్డు కొట్టేశాడు. శనివారం (జూన్ 15) ఉదయం ఉగాండాపై జరిగిన మ్యాచ్ లో తన నాలుగు ఓవర్ల స్పెల్ పూర్తి చేసిన సౌథీ.. ఒక మెయిడీన్ ఓవర్ తో కేవలం నాలుగు పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ పరంగా టీ20 క్రికెట్ చరిత్రలో ఇవే అత్యుత్తమ గణాంకాలు. 

నాలుగు ఓవర్ల కోటాలో సౌథీ ఎకానమీ ఒకటి మాత్రమే ఉంది. ఈ మ్యాచ్ లో సౌథీ తీసుకున్న మూడు వికెట్లు ఎల్బీడబ్ల్యూ రూపంలోనే రావడం విశేషం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఈ కివీస్ బౌలర్ కే లభించింది. ఇప్పటివరకు ఈ రికార్డ్ ఆఫ్‌ స్పిన్నరైన సుబుగా పేరిట  ఉంది. ఇదే వరల్డ్ కప్ లో సుబుగా న్యూ గినియాపై తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 4 పరుగులిచ్చి రెండు వికెట్లు (4-2-4-2) పడగొట్టాడు. ఇందులో రెండు మెయిడిన్లు కూడానూ.

టీ20 వరల్డ్ కప్‌ చరిత్రలో ఇదే బెస్ట్ ఎకానమీ (1.00) బౌలింగ్‌ కాగా.. సౌథీ తాజాగా ఈ రికార్డ్ బ్రేక్ చేశాడు. ఇద్దరి ఎకానమీ సమానమైనా.. ఒక వికెట్ ఎక్కువ తీయడంతో ఈ రికార్డ్ సౌథీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. సౌథీతో పాటు బోల్ట్, సాంట్నర్ చెలరేగడంతో ఈ మ్యాచ్ లో ఉగాండా కేవలం 40 పరుగులకే ఆలౌటైంది. 41 పరుగుల లక్ష్యాన్ని న్యూజీలాండ్ 5.2 ఓవర్లలో ఛేజ్ చేసింది. ఇప్పటికే ఈ టోర్నీ నుంచి ఈ రెండు జట్లు నిష్క్రమించాయి. వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్ ఈ గ్రూప్ లో సూపర్ 8 కు చేరుకున్నాయి.