ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గర పడుతుంది. మరో రెండు వారాల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. 2017 తర్వాత మరోసారి ఈ ఐసీసీ టోర్నీ జరగనుండడంతో భారీ హైప్ నెలకొంది. ఈ టోర్నీలో ఏ జట్లు ఫైనల్ కు చేరతాయో.. ఇప్పటికే దిగ్గజాలు తమ ప్రిడిక్షన్ చెప్పేశారు. తాజాగా న్యూజిలాండ్ దిగ్గజ పేసర్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవరు టాప్ స్కోరర్ గా నిలుస్తారో తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బాబర్ అజామ్ లాంటి పేర్లు పక్కన పెట్టి తన సొంత జట్టు ఆటగాడికి ఓటేశారు. స్టార్ ప్లేయర్ విలియంసన్ టాప్ స్కోరర్ గా నిలుస్తాడని చెప్పుకొచ్చాడు.
2024 డిసెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన సౌతీ.. ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. ఇలా అన్నాడు " పాకిస్థాన్ వికెట్ చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఈ టోర్నీలో టాప్ స్కోరర్ విలియంసన్ నిలుస్తాడని అనుకుంటున్నాను. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడడంలో విలియంసన్ దిట్ట. అతని సామర్థ్యం మీద నాకు నమ్మకం ఉంది. కఠిన పరిస్థితుల్లో అతని అనుభవం కివీస్ కు కలిసి వస్తుంది. కేన్ కు వన్డేల్లో అద్భుతమైన రికార్డ్ ఉంది. న్యూజిలాండ్ సెమీస్ కు వెళ్లాలంటే విలియంసన్ రాణించడం చాలా కీలకం". అని సౌథీ అన్నాడు.
ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ గురించి కూడా మాట్లాడాడు. " విలియంసన్ తో పాటు ఈ టోర్నీలో ట్రావిస్ హెడ్ ప్రమాదకరమైన ఆటగాడని నేను భావిస్తున్నాను. గత వన్డే ప్రపంచ కప్‌లో అతను అద్భుతంగా రాణించాడు. పాకిస్తాన్, ఆస్ట్రేలియాలలో అతను చాలా చక్కగా రాణిస్తాడని భావిస్తున్నాను. ఐసీసీ ఈవెంట్లలో ఆస్ట్రేలియా ఫైనల్ కు ఖచ్చితంగా అర్హత సాధిస్తుందని అనుకుంటున్నాను". అని సౌథీ చెప్పుకొచ్చాడు.
వన్డే ఫార్మాట్ లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టాప్ 8 జట్లు ఆడతాయి. ఈ ఐసీసీ టోర్నీపై ఎప్పుడూ లేని విధంగా ఈ సారి భారీ హైప్ నెలకొంది. తొమ్మిదో ఎడిషన్ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరుగుతుంది. పాకిస్తాన్,దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. పాకిస్థాన్ లోని లాహోర్, కరాచీ, రావల్పిండి ఎనిమిది జట్లు ఆడే ఈ టోర్నమెంట్‌లో మొత్తం 10 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. భారత జట్టు పాల్గొనే మ్యాచ్‌లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి.
Tim southee predict's leading run scorer in the champions trophy 🏆 #ChampionsTrophy2025 pic.twitter.com/027mBFyrZz
— kinetic_45 (@kinetic_karthi) February 3, 2025