బీజేపీ స్టైలే వేరప్పా.. CM పేరు ఖన్ఫామ్ చేయకుండానే ప్రమాణ స్వీకారానికి టైమ్, డేట్ ఫిక్స్

బీజేపీ స్టైలే వేరప్పా.. CM పేరు ఖన్ఫామ్ చేయకుండానే ప్రమాణ స్వీకారానికి టైమ్, డేట్ ఫిక్స్

న్యూఢిల్లీ: దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా.. అందులో బీజేపీ తీరు డిఫరెంట్‎గా ఉంటుంది. కమలం పార్టీ వ్యూహాలు, నిర్ణయాలు.. ప్రతిపక్షాలకే కాకుండా సొంత పార్టీ నేతలకు కూడా అంతు చిక్కవు. పార్టీకి సంబంధించిన ఏ చిన్న విషయం కూడా చివరి నిమిషం వరకు లీక్ కాకుండా ప్లాన్ పక్కాగా అమలు చేస్తోంది. ఇటీవల మహారాష్ట్రలో  చోటు చేసుకున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. 2024 చివరాకర్లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో సీఎం పదవికి కోసం కూటమిలోని మూడు పార్టీలు పోటీ  పడ్డాయి. ఈ అంశాన్ని బీజేపీ హై కమాండ్ చాలా జాగ్రత్తగా డీల్ చేసింది. సీఎం అభ్యర్థి పేరు ప్రకటించకుండానే కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి తేదీ, ప్లేస్‎ను ఫిక్స్ చేసింది. 

ఇది చాలా మందిని విస్మయానికి గురి చేసింది. సీఎం అభ్యర్థి పేరు ఖన్ఫామ్ చేయకుండా ప్రమాణా స్వీకారానికి ఏర్పాట్లు ఏంటి అంటూ  చర్చలు సాగాయి. ఈ క్రమంలో ప్రమాణ స్వీకారానికి కొన్ని గంటల ముందు సీఎం అభ్యర్థి పేరును బీజేపీ రివీల్ చేసింది. కూటమిలో విభేదాలు రావొద్దనే ఉద్దేశంతో బీజేపీ ఈ వ్యుహాన్ని ఇంప్లిమెంట్ చేసింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఢిల్లీలో కూడా బీజేపీ ఇదే స్ట్రాటజీ అమలు చేస్తోంది. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అధికార ఆమ్ ఆద్మీ పార్టీని చిత్తు చేసి దాదాపు 26 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో బీజేపీ గెలుపు రుచి చూసింది.

ALSO READ | అహాన్ని పక్కన పెట్టండి: సీఈసీ ఎంపికను వాయిదా వేయాలని కాంగ్రెస్ డిమాండ్

 దీంతో సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో బీజేపీ హై కమాండ్ అచీతూచీ వ్యవహరిస్తోంది. ఎన్నికల ఫలితాలు విడుదలై దాదాపు 10 రోజులు గడిచినప్పటికీ సీఎం అభ్యర్థిని ఖరారు చేయలేదు. అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకుని సీఎం ఎంపికపై కసరత్తు చేస్తోంది. అయితే.. సీఎం ఎవరనేది ఖరారు చేయకుండానే.. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి తేదీ, వేదికను ఫిక్స్ చేసింది. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో 2025, ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 19న జరగనున్న బీజేపీ ఎల్పీ సమావేశంలో బీజేపీ శాసన సభ నేతను ఎన్నుకుంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 

26 ఏళ్ల తర్వాత హస్తినా పీఠం దక్కడంతో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే రామ్ లీలా మైదానంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర కేంద్రమంత్రులు, బీజేపీ కీలక నేతలు హాజరు కానున్నారు.

 ఇక, ఢిల్లీ సీఎం రేసులో ప్రముఖంగా ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. పర్వేష్ వర్మ, రేఖా గుప్తా, విజేందర్‎ల పేర్లు రేసులో ముందు వరుసలో ఉన్నాయి. అయితే, కేజ్రీవాల్‎ను ఓడించి జైయింట్ కిల్లర్‎గా పేరు గాంచిన పర్వేష్ వర్మకే ఢిల్లీ సీఎం పగ్గాలు  అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ వరకు బాగానే ఉన్న సీఎం అభ్యర్థి పేరు ప్రకటించకుండానే ప్రమాణ స్వీకారాని డేట్, టైమ్ ఫిక్స్ చేయడంతో.. సీఎం ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.