- అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు .. 11న జాతరకు సీఎం రేవంత్ రెడ్డి
- కర్నాటక, మహారాష్ర్ట, ఏపీ, తెలంగాణ నుంచి తరలిరానున్న భక్తులు
- గుట్టపైకి ఘాట్ రోడ్డు నిర్మాణానికి
- రూ.110 కోట్లు మంజూరు చేసిన సర్కారు
మహబూబ్నగర్/చిన్నచింతకుంట, వెలుగు :పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి బ్రహ్మోత్సవాల ప్రధాన ఘట్టానికి వేళ అయ్యింది. ఉత్సవాల్లో ముఖ్యమైన ఉద్దాల (పాదుకలు) ఉత్సవాన్ని శుక్రవారం నిర్వహంచనుండగా.. వేడుకను చూసేందుకు కర్నాటక, మహారాష్ర్ట, ఏపీ, తెలంగాణ నుంచి దాదాపు 5 లక్షల మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎండోమెంట్, రెవెన్యూ, పోలీస్ ఇతర డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
కాగా.. సోమవారం క్షేత్రానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సీఎం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తర్వాత సీఎం కురుమూర్తి ఆలయానికి రావడం ఇదే తొలిసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2003లో అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు.
12వ శతాబ్దం నుంచే ఉత్సవాలు..
కురుమూర్తి క్షేత్రం 12వ శతాబ్దం నుంచి ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. 1268లో ముక్కెర వంశ మూల పురుషుడు గోపాల రాయుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. 1350లో చంద్రారెడ్డి అభివృద్ధి చేయగా, సోమభూపాలరావు కొండపైకి మెట్లు కట్టించాడు. ఆయన హయాంలోనే ఏటా జాతర నిర్వహించే సాంప్రదాయం ప్రారంభమైంది. 1870లో ఉద్దాల మండపం ఏర్పాటు చేశారు. ఈ మండపంలోనే ఉద్దాలను ఉంచి భక్తులకు దర్శనమిస్తారు. ఉద్దాలను భక్తులు వీపుపై కొట్టించుకుంటే పాపాలు పోతాయని నమ్ముతారు. 1966లో ఈ క్షేత్రం దేవాదాయ శాఖలో విలీనం అయ్యింది. అయితే 1999లో కొత్తగా మండపం ఏర్పాటు చేశారు.
ఏర్పాట్లు పూర్తి
ఉత్సవాల సందర్భంగా ఐదు లక్షల మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో వెయ్యి మంది పోలీసు బందోబస్తు నిర్వహించనున్నారు. కోనేరులో మిషన్ భగీరథ నీటిని నింపి సిద్ధం చేశారు. 50 వరకు మొబైల్ టాయ్లెట్లను అందుబాటులో ఉంచారు. ఇవి కాకుండా గతంలో దాతల సహకారంతో నిర్మించిన 50 టాయిలెట్స్ కూడా ఉన్నాయి. తాగునీటి కోసం మంచి నళ్లాలను ఏర్పాటు చేశారు. సమీప గ్రామాల నుంచి వాటర్ ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని సరఫరా చేయనున్నారు. శానిటేషన్ కోసం 150 మంది గ్రామ పంచాయతీ మల్టీపర్సస్ వర్కర్లను నియమించారు. ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే భక్తుల సౌకర్యార్థం మహబూబ్నగర్ ఆర్టీసీ డిపో నుంచి క్షేత్రానికి 750 బస్సులను ఏర్పాటు చేశారు. ప్రతి అరగంట ఒక బస్సు కురుమూర్తికి తిప్పననున్నారు.
ఘాట్ రోడ్డు మంజూరు
కురుమూర్తి క్షేత్రానికి ఘాట్ రోడ్డు మంజూరైంది. గుట్టపైకి వెళ్లేందుకు ఎలివేటేడ్ కారిడార్ రోడ్ నిర్మాణానికి రాష్ర్ట ప్రభుత్వం గురువారం రూ.110 కోట్లు శాంక్షన్ చేసిందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు జీవో రిలీజ్ అయినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.