కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ సమయం పూర్తయిందని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్ మధుసూధన్ మిస్ట్రీ తెలిపారు. ఏఐసీసీ ఎన్నికల పోటీలో మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ ఉన్నారని స్పష్టం చేశారు. అక్టోబర్ 17 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోలింగ్ జరగనుందని తెలిపారు. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఈ ఓటింగ్ జరగనుంది. భారత్ జోడో యాత్రలో ఉన్న వాళ్లకోసం పోస్టల్ బ్యాలెట్ ను ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే అధికారులు తెలిపారు. అక్టోబర్ 19వ తేదీన ఢిల్లీలో ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు 9 వేల మందికి పైగా కాంగ్రెస్ ప్రతినిధులు ఓటు వేయనున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చివరిసారిగా నవంబర్, 2000లో ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో సోనియాగాంధీ చేతిలో జితేంద్ర ప్రసాద ఓడిపోయారు. అంతకుముందు 1997లో శరద్ పవార్, రాజేష్ పైలట్‌లను సీతారాం కేస్రీ ఓడించారు.