అమ్రాబాద్, వెలుగు: పులులు, చిరుతలు, ఎలుగు బంట్లు, ఇతర వన్యప్రాణులు సంతానోత్పత్తికి సమయం ఆసన్నమైంది. దీంతో ఎన్టీసీఏ సూచన మేరకు జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో అటవీశాఖ ఆంక్షలు విధించింది. అడవుల్లో మానవ సంచారం కారణంగా పెద్ద పులుల్లో గర్భధారణ అవకాశాలు పడిపోతున్నాయనే నివేదికల కారణంగా ఎంటీసీఏ 90 రోజుల పాటు టైగర్ రిజర్వ్ లో నిబంధనలు అమలు చేస్తోంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్(ఏటీఆర్) దేశంలోనే అతిపెద్ద రిజర్వ్ ఫారెస్ట్లలో ఆరోదిగా నిలిచింది. నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాల పరిధిలో 2,611.39 చదరపు కిలోమీటర్ల పరధిలో ఏటీఆర్ విస్తరించి ఉంది. గతంలో ఇక్కడ పులుల సంతానోత్పత్తి దేశ సగటు కన్నా ఎక్కువగా ఉండేది. ఇక్కడి వాతావరణం, ఏరియా విస్తీర్ణం, పెరుగుతున్న శాఖాహార జంతువుల కారణంగా ఇక్కడ100 టైగర్ల వరకు నివసించేందుకు చాన్స్ ఉంది. గతంలో 18 పెద్ద పులులు ఉండగా, ప్రస్తుతం 23కి పెరిగినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు.
ALSOREAD:హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్గా ప్రొఫెసర్ లింబ్రాది
అడవిలోకి రావొద్దు..
పులులతో పాటు వన్యప్రాణుల సంతానోత్పత్తి కోసం జులై 1 నుంచి 30 వరకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లోకి పర్యాటకులను అనుమతించబోమని . డీఎఫ్ వో రోహిత్ గోపిడి తెలిపారు. సఫారీ సేవలను కూడా నిలిపివేస్తున్నామని చెప్పారు. పులులు సంతానోత్పత్తి సమయంలో చాలా ఆవేశపూరితంగా ఉంటాయని, మనుషులపై దాడులకు పాల్పడే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని నల్లమలలో అడవిలోకి ఎవరికీ పర్మిషన్ ఇవ్వమని చెప్పారు. సమీప గ్రామాల ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నామని, పశువులను బఫర్ ఏరియాలో మేపుకునేలా అవకాశం కల్పించామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.