ఖమ్మం టౌన్, వెలుగు : నియంతృత్వ, అప్రజాస్వామిక పాలనను తరిమి కొట్టేందుకు కాపులు కాంగ్రెస్ పార్టీకి కాపుకాసే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలోని ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్ లో పసుపులేటి దేవేందర్ అధ్యక్షతన ఖమ్మం జిల్లా మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
డీసీసీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సిటీ అధ్యక్షుడు జావీద్, టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా తుమ్మల మాట్లాడుతూ మున్నూరుకాపులకు కాంగ్రెస్ లో ఎప్పటికీ ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. పాలేరు, ఖమ్మం నియోజకవర్గాలు మాత్రమే కాదు.. ఉమ్మడి జిల్లాలోని పది సీట్లలో పది స్థానాలు గెలిపించాలని కోరారు. అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక జనాభా గల కులం, రాష్ట్రాన్ని శాసించగలిగే కులం మున్నూరుకాపు కులమని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అది చేశాం.. ఇది చేశామని కథలు చెప్పడం తప్ప చేసిందేమీలేద్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మున్నూరుకాపు కార్పొరేషన్ ను, సామాజిక వర్గానికి రావాల్సిన పదవులను కల్పించడంలో తనతోపాటు తుమ్మల కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. అంతుకుముందు మున్నూరుకాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి శెట్టి రంగారావు, ముదిగొండ బీఆర్ఎస్ పార్టీ విభాగంకు చెందిన వేల్పుల రామకృష్ణ, టీడీపీ నుంచి కనపర్తి ఉషారాణి కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత ఖమ్మం పట్టణ పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ALSO READ : కాంగ్రెస్‌ది ప్రజల ఎజెండా : సీతక్క