- ఉదయం 9.40 గంటల్లోపే ఆఫీస్‌కు రావాలని ఆర్డర్స్
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు
- టైం అంటే టైమే అంటూ సాయంత్రం 5 గంటలకే వెళ్లిపోయిన సిబ్బంది
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆఫీసర్లు వర్క్ టైమింగ్స్ పాటించాలంటూ యాజమాన్యం జారీ చేసిన ఆర్డర్‌పై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. హెడ్ ఆఫీస్‌లో పనిచేసే వారంతా ఉదయం 9.40 గంటలల్లోపే ఆఫీస్‌కు రావాలని రెండు రోజుల కిందట ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆర్డర్స్ గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి.
అయితే ఆర్డర్స్‌కు అనుగుణంగా ఉదయం ఇన్‌టైంలోనే వచ్చిన ఉద్యోగులు, ఆఫీసర్లు సాయంత్రం ఐదు గంటలకే ఇంటి బాటపట్టారు. ‘సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేసినా యాజమాన్యం ఏమీ అదనపు జీతం ఇవ్వడం లేదు.. కాబట్టి టైమ్ అంటే టైమే’ అంటూ అందరూ వెళ్లిపోవడంతో ఆఫీస్ బోసిపోయింది.
లేట్‌గా వస్తే రిజిస్టర్‌లో నమోదు
సింగరేణి హెడ్ ఆఫీస్‌లో 800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందరూ ప్రతి రోజు ఉదయం 9.30 గంటల వరకు ఆఫీస్‌లో ఉండాలని ఆర్డర్స్ జారీచేసిన యాజమాన్యం, 10 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇచ్చింది. ఈ టైం దాటిన తర్వాత ఆఫీస్‌కు వస్తే లేట్ అయినట్లుగా పరిగణనిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. లేట్‌గా వచ్చిన వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని సెక్యూరిటీ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో గురువారం ఉదయం సింగరేణి ఆఫీస్ మెయిన్ గేట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది హడావుడి చేశారు. 9.40 తర్వాత కేవలం నలుగురైదుగురు ఉద్యోగులు మాత్రమే రావడం గమనార్హం.
ఔట్ గోయింగ్ టైమింగ్స్‌నూ నమోదు చేయాలి
ఉద్యోగులు ఆఫీస్‌లోకి వచ్చే టైమింగ్స్‌ను నమోదు చేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది ఔట్ గోయింగ్ టైమింగ్స్‌ను సైతం నమోదు చేయాలని ఉద్యోగులు, ఆఫీసర్లు డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా మధ్యాహ్నం లంచ్ ఒంటి గంట నుంచి 1.30 గంటల వరకు ఉంటుంది. అయితే ఉన్నతాధికారి ఆదేశాల మేరకు ఓ ఉద్యోగి రెండు గంటల వరకు పనిచేసి లంచ్‌కు వెళ్లి 2.30 గంటలకు వెస్తే గంట ఆలస్యంగా వచ్చినట్లు సెక్యూరిటీ సిబ్బంది నమోదు చేస్తున్నారంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఐదు గంటలకే ఆఫీస్ ఖాళీ
సింగరేణి హెడ్ ఆఫీస్‌లో ఉన్న హెచ్‌ఓడీలు మధ్యాహ్నం లంచ్‌కు వెళ్లి నాలుగు గంటలకు తిరిగి ఆఫీస్‌కు వస్తారు. వారు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఆఫీస్‌లో ఉంటారు. హెచ్‌వోడీలు ఉన్నంత వరకు ఉద్యోగులు సైతం ఆఫీస్‌లోనే ఉంటారు. కానీ వర్క్ టైమింగ్స్‌పై యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు.
‘ఉదయం 10 నిమిషాలు ఆలస్యంగా వస్తే ఇబ్బంది పెట్టే యాజమాన్యం రాత్రి 7 గంటల వరకు పని చేస్తుంటే అదనపు జీతం ఇస్తుందా ? ఇప్పటివరకు హెచ్‌వోడీ ఉన్నంత వరకు తామూ ఉంటున్నామని, ఇక నుంచి టైం టూ టైం డ్యూటీ చేస్తాం’ అని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 5 గంటలకే ఉద్యోగులు అందరూ వెళ్లిపోయారు. దీంతో పలువురు హెచ్‌వోడీలు ఫైళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.