రూ. 431 కోట్లు కట్టండి : బార్క్​కు టైమ్స్ గ్రూప్ లీగల్ నోటీసు

21.83 కోట్ల లైసెన్స్ ఫీజును తిరిగివ్వాలని డిమాండ్
ఏడు రోజుల గడువిచ్చిన మీడియా నెట్​వర్క
నోటీసులపై స్పందించేందుకు నిరాకరించిన బార్క్

ముంబై: బ్రాడ్​కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్)కు టైమ్స్ గ్రూప్ లీగల్ నోటీసులు పంపింది. తమ ఇంగ్లిష్ న్యూస్ చానల్ వ్యూయర్​షిప్​ను బార్క్ ఉద్దేశపూర్వకంగా తగ్గించిందని, 2017లో ప్రారంభించిన ఓ చానల్ ఆదేశాల మేరకే ఇలా చేసిందని ఆరోపించింది. తమ రెవెన్యూ తగ్గినందుకు నష్టపరిహారంగా రూ.431 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు టైమ్స్ గ్రూప్ ఓనర్ సంస్థ బెన్నెట్, కోల్​మన్ అండ్ కంపెనీ లిమిటెడ్ (బీసీసీఎల్)  నోటీసులు పంపింది. ‘‘టైమ్స్ నౌ వ్యూయర్​షిప్ నంబర్లను కొత్తగా ప్రారంభించిన చానెల్‌‌కు ప్రయోజనం చేకూర్చడం కోసం కావాలనే తగ్గించారు. తప్పుడు, మ్యానిపులేటెడ్ డేటా రిలీజ్ చేయడం వల్ల.. టైమ్స్ నౌ చానల్, టైమ్స్ గ్రూప్ రెవెన్యూ, గ్రోత్, రెప్యుటేషన్, గుడ్​విల్, ఇమేజ్‌‌పై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రభావితం పడింది’’ అని నోటీసుల్లో పేర్కొంది.

మేమే నంబర్ వన్ అని చెప్పండి

నష్ట పరిహారం కింద రూ.431 కోట్లతోపాటు, తాము చెల్లించిన 21.83 కోట్ల లైసెన్స్ ఫీజును తిరిగి కట్టాలని టైమ్స్ గ్రూపు స్పష్టం చేసింది. 2017 నుంచి 2019 దాకా ఇంగ్లిష్ న్యూస్ జానర్​లో టైమ్స్ నౌ ‘లీడర్’ అని, నంబర్ వన్ చానల్ అని పేర్కొంటూ స్టేట్​మెంట్ పబ్లిష్ చేయాలని డిమాండ్ చేసింది. టైమ్స్ నౌ నంబర్స్ తగ్గించేందుకు సంబంధించి రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నబ్ గోస్వామి, బార్క్ మాజీ సీఈవో పార్థో దాస్​గుప్తా మధ్య జరిగిన చాట్ వివరాలను కూడా నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు బార్క్​కు 7 రోజుల గడువు ఇచ్చింది. ఆ లోపు స్పందించకుంటే క్రిమినల్, సివిల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించింది. తెలుగు న్యూస్ చానల్స్ కేటగిరీలో కూడా టీఆర్పీ మ్యానిపులేషన్ జరిగినట్లు పోలీసులు చెప్పిన విషయాన్ని ప్రస్తావించింది.