తీన్మార్​ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం : మంత్రి వెంకట్​ రెడ్డి

  • ప్రజల కోసం పోరాడే వ్యక్తి సభలో ఉండాలి : మంత్రి వెంకట్​ రెడ్డి
  • నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తీన్మార్​ మల్లన్న నామినేషన్​  

నల్గొండ అర్బన్, వెలుగు : కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్​ ప్రజలకు చేసిందేమీ లేదని, అదానీ, అంబానీకి దోచిపెట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా నల్గొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఏచూరి గార్డెన్స్ లో నిర్వహించిన సమావేశంలో మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడారు.

దేశంలో నల్లధనాన్ని వెలికి తీసి పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానన్న ప్రధాని నేటికీ 15 రూపాయలు కూడా జమచేయలేదన్నారు.  బీఆర్​ఎస్​కు  ఒక్క ఎంపీ సీటు కూడా వచ్చే అవకాశం లేదన్నారు. అధికారం పోయాక కేసీఆర్ ఫ్యామిలీ ఛిన్నాభిన్నం అయిందని, కూతురు తీహార్ జైల్లో ఉందని, కేసీఆర్, కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో  తీన్మార్ మల్లన్నను గెలిపించుకోవాలని, ప్రజల తరఫున ప్రశ్నించే వ్యక్తి సభలో ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు.  దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా తీన్మార్ మల్లన్న.. ఆయన పేరున, కుటుంబం పేరున ఉన్న కోటిన్నర ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చారన్నారు.  

లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న మల్లన్న

యాదగిరిగుట్ట, వెలుగు : నామినేషన్​కు ముందు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని తీన్మార్ మల్లన్న దర్శించుకున్నారు. నామినేషన్ పత్రాలను స్వామి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం కార్ల ర్యాలీతో యాదగిరిగుట్ట నుంచి న ల్లొండకు చేరుకున్నారు. అంతకు ముందు తన స్వగ్రామం యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ లో తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకున్నారు.  

కేసీఆర్​ను గద్దె దించే వరకు పోరాడిన : తీన్మార్​ మల్లన్న 

ఒక్కసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకొస్తానని తీన్మార్ మల్లన్న అన్నారు. కేసీఆర్​ను గద్దె దించే వరకు పోరాడానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.