- దొంగ హామీలిచ్చి ప్రజలను ముంచిండు
- కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ తీన్మార్ మల్లన్న
- కేసీఆర్ ను ప్రజలు తరిమికొడతారని కామెంట్
స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు : మోసాలకు కేరాఫ్ అడ్రస్ సీఎం కేసీఆర్ అని కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న విమర్శించారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని దొంగ హామీలిచ్చి ప్రజలను సీఎం మోసం చేశారని ఆయన ధ్వజమెత్తారు. మంగళవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ తరపున నిర్వహించిన రోడ్‌షో లో మల్లన్న మాట్లాడారు. సీఎం కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మడం లేదన్నారు. ఈసారి కేసీఆర్ ను ప్రజలు తరిమికొట్టడం ఖామయన్నారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో సీఎం కేసీఆర్ రూ.లక్షన్నర కోట్లు తిన్నడు. సీఎం తిన్న ఆ లక్షన్నర కోట్లను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గుంజుతం.
పేదలకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టివ్వలేదు. రాష్ట్రంలో వైన్స్‌షాపుల నోటిఫికేషన్లు సక్రమంగా జరుగుతాయి. కానీ ఉద్యోగ నియామకాలు మాత్రం జరగవు. గ్రూప్ 1 పరీక్ష ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. గ్రూప్ 2 పరీక్ష కూడా వాయిదా పడింది. గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా ఆగిపోతాయి. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ చెలగాటం ఆడిండు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను కూడా కేసీఆర్ మోసం చేసిండు” అని మల్లన్న విమర్శించారు.
స్టేషన్‌ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ను ఓడించేందుకు ముగ్గురు ఏకమైనా, అది జరగని పని అని ఆయన చెప్పారు. కడియం శ్రీహరి గెలిస్తే రేషన్ కార్డులను తొలగించే కుట్ర చేస్తున్నారని మల్లన్న ఆరోపించారు. ఈ ప్రచార కార్యక్రమంలో జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, మాజీ ఎమ్మెల్యే రాజారెడ్డి, ఎంపీటీసీ సింగపురం దయాకర్ తదితరులు పాల్గొన్నారు.