
హైదరాబాద్, వెలుగు : తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, సీడబ్ల్యూసీ సభ్యుడు గురుదీప్ సిప్పల్, ఏఐసీసీ ఇన్చార్జి సెక్రటరీలు బోసు రాజు, పీసీ విష్ణునాథ్, రోహిత్ చౌదరి, మన్సూర్ అలీ ఖాన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్టు తెలుస్తున్నది. అంతేగాకుండా పార్టీ స్టార్ క్యాంపెయినర్, ప్రచార కమిటీ కో కన్వీనర్‌గా నియమిస్తామని హామీ ఇచ్చారని సమాచారం.
కాగా, మేడ్చల్ స్థానం నుంచి బరిలోకి దిగాలని భావించిన తీన్మార్ మల్లన్న.. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. మేడ్చల్‌లో పోటీ అంశంపై చాన్నాళ్లపాటు ఆయన కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపినట్టు తెలిసింది. నేరుగా పార్టీ నుంచి పోటీ చేయకుండా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగితే.. తనకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా మల్లన్న కోరినట్టు చెప్తున్నారు. గుజరాత్లో ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీకి సపోర్ట్ చేసినట్టుగా తనకూ మద్దతివ్వాలని కోరారని అంటున్నారు. అయితే, ఆ స్థానం నుంచి వజ్రేశ్ యాదవ్‌కు టికెట్ కన్ఫర్మ్ కావడంతో.. మల్లన్నతో పార్టీ నేతలు మరోసారి చర్చలు జరిపినట్టు సమాచారం. ఆ చర్చల్లోనే ఆయనకు ఎమ్మెల్సీ, స్టార్ క్యాంపెయినర్, ప్రచార కమిటీ కో కన్వీనర్ పదవులను ఇస్తామని పార్టీ నేతలు హామీ ఇచ్చారని చెప్తున్నారు.
మల్లన్న భార్యకు తుంగతుర్తి టికెట్?
తీన్మార్ మల్లన్న ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నా.. ఆయన భార్య మమతకు తుంగతుర్తి టికెట్ ఇస్తారని ప్రచారం సాగుతున్నది. కాంగ్రెస్ పార్టీ పెండింగ్‌లో పెట్టిన నాలుగు స్థానాల్లో తుంగతుర్తి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ స్థానం నుంచి మల్లన్న భార్య పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆమె వివరాలనూ ఏఐసీసీ పెద్దలు తీసుకున్నట్టు చెప్తున్నారు. ఇప్పటికే ఆ టికెట్ కోసం అద్దంకి దయాకర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అదే టికెట్ కోసం మాజీ ఎంపీ నంది ఎల్లయ్య తమ్ముడి కొడుకు కూడా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే తుంగతుర్తి టికెట్‌పై ఆసక్తి నెలకొంది.