- 317 జీవో ఇబ్బందులు సరి చేయిస్తా
- గెలిచిన వెంటనే సీఎంతో మీటింగ్ ఏర్పాటు చేయిస్తా
- కేటీఆర్ ఆశలు అడియాశలు చేస్తా
- కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న
నకిరేకల్, వెలుగు: కేటీఆర్ రోజూ రెండు ఫేక్ వీడి యోలు తయారు చేయించి తనను ఓడించాలని కష్టాలు పడుతున్నాడని, తాను గెలిచి ఆయన ఆశలు అడియాశలు చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. నల్లగొండ–-ఖమ్మం-– వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబం ధించి నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశంతో పాటు పట్టభద్రుల సన్నాహక మీటింగ్ మంగళవారం శ్రీనివాస గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఇందులో పాల్గొన్న తీన్మార్మల్లన్న మాట్లాడుతూ ప్రజల హక్కుల కోసం పోరాడితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెట్టిందని, అయినా తలవంచలేదన్నారు.
జైలుకు పంపితే కుటుంబానికి, సమాజానికి దూరంగా ఉన్నా బెదరలేదన్నారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చుపెట్టి, నాలుగు రోజులపాటు కౌంటింగ్ నిర్వహించి బోగస్ ఓట్లతో పల్లా రాజేశ్వర్రెడ్డి విజయం సాధించారన్నారు. పల్లాకు కబ్జాలు, అక్రమ సంపాదన తప్ప నిరుద్యోగులు, ఉద్యోగుల బాధలు తెలియవన్నారు. పల్లా ఒక్క ఉపాధ్యాయ సంఘాన్ని పట్టించుకోలేదని, నిరుద్యోగుల గురించి మర్చిపోయాడన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో ఈ ఉప ఎన్నికలో ఎమ్మెల్సీగా గెలవబోతున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. గెలిచిన మొదటి వారంలోనే అన్ని ఉపాధ్యాయ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డితో ముఖాముఖి ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.
317 జీవో ద్వారా ఉద్యోగులకు ఇబ్బందులు కలిగాయని, వాటిని సరిచేస్తామన్నారు. 46 జీవో ద్వారా నిరుద్యోగుల చావులకు కారణమైన బీఆర్ఎస్ లీడర్లకు బుద్ది వచ్చేలా చేస్తామన్నారు. మూడు జిల్లాల్లో 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారని, బీఆర్ఎస్కు ఇద్దరే ఉన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన నకిరేకల్ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ఎన్ని కేసులు పెట్టినా..ఎన్నిసార్లు జైలుకు పంపించినా భయపడకుండా ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా కొట్లాడిన వ్యక్తి తీన్మార్ మల్లన్న అని కొనియాడారు.
తాను ఎంతోమంది జర్నలిస్టులను చూశానని, నికార్సయిన జర్నలిస్టుగా ఎన్నో అరాచకాలు చేసిన గత ప్రభుత్వాన్ని గద్దె దింపుతానని ఛాలెంజ్ చేసిన దమ్మున్న మొగోడు మల్లన్న అని అన్నారు. మల్లన్నను పట్టభద్రుల ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, ట్రస్మా అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి, కాంగ్రెస్ స్టేట్ లీడర్ దైద రవీందర్, పూజర్ల శంబయ్య , చామల శ్రీనివాస్, బత్తుల ఉషయ్య గౌడ్, బచ్చుపల్లి గంగాధర్ రావు పాల్గొన్నారు.