ఐదు లక్షల మంది బీసీలతో బహిరంగ సభ నిర్వహిస్తాం : తీన్మార్ మల్లన్న

హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ లో బీసీలు మీటింగ్ పెట్టవద్దా..? అని తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. తాజ్ కృష్ణ హోటల్ నుండి బీసీలకు రక్షణ దొరకాలన్నారు. అక్టోబర్ మొదటి వారంలో ఐదు లక్షల మంది బీసీలతో బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. తమకు పార్టీలతో పొత్తు కాదని, కులాలతోనే పొత్తు అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ లెక్క తేలిపోయింది.. ఇప్పుడు బీసీల లెక్క బలంగా ఉందన్నారు. పార్టీలకు అతీతంగా కులాల పొత్తుతో కూడిన జేఏసీ ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. 

Also Read : బీఆర్ఎస్ అధిష్టానానికి అసంతృప్తుల తలనొప్పి

అన్ని బీసీ కులాల నుండి 5 లక్షల మంది బీసీ సభలలో పాల్గొనాలని తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం మొట్టమొదటిగా మంత్రి పదవిని త్యాగం చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ లో తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో ఎన్నికలపై బీసీ కులాల చర్చ అనే పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు బీసీ సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 

ముదిరాజ్ నాయకులు ఆందోళనలు, నిరసనలు చేస్తున్నా.. రాజకీయ పార్టీలు మాట్లాడకుండా మౌనంగా గమనిస్తున్నాయని చెప్పారు. పద్మశాలీలు కూడా కోరుట్లలో బహిరంగ సభ పెట్టినా ఏ ఒక్క పార్టీ స్పందించలేదన్నారు. బీసీల్లో ఉన్న ప్రతి కులం నోరు విప్పాలన్నారు. తెలంగాణలో అన్ని ఉద్యమాలు అయిపోయాయని, ఇక బీసీల ఉద్యమమే ఉందన్నారు. మన కోసం మనం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.