ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం రేపటితో ముగియనున్న నేపథ్యంలో ఒకవైపు ప్రచారం, మరొక వైపు నామినేషన్లతో నేతలంతా బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ అభ్యర్థి వీరాంజనేయులు వినూత్న రీతిలో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. టిప్పర్ నడుపుకుంటూ భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు వీరాంజనేయులు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
గతంలో వీరాంజనేయులును ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా టిఅప్పర్లో వెళ్లి నామినేషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఎస్సీ రిజర్వ్డ్ అయిన సింగనమలలో సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మావతిని కాదని వీరాంజనేయులుకు టికెట్ కేటాయించటంపై బాబు వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. గతంలో వీరాంజనేయులు పద్మావతి భర్త వద్ద టిప్పర్ డ్రైవర్ గా పని చేసి ఆ తర్వాత సర్పంచ్ గా గెలిచాడు. నామినేషన్ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు పేదలంటే చిన్నచూపని, అందుకే డ్రైవర్ కు టికెట్ ఇవ్వడంపై హేళనగా మాట్లాడారని అన్నారు. సామాన్యుడిని అసెంబ్లీకి పంపాలన్న జగన్ ఆశయాన్ని నెరవేర్చేందుకు సింగనమల ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.