- పుట్టిన వెంటనే బిడ్డ తలకు క్యాప్ పెడితేనే తల గుండ్రంగా ఉంటుందా?
- పుట్టిన రోజే స్నానం చేయించాలా? లేదంటే ఐదో రోజు చేయించాలా?
- పాలు రోజులో ఎన్నిసార్లు తాగించాలి? తాగించిన వెంటనే పడుకోబెట్టొచ్చా?
- మొదటిసారి బిడ్డ పుట్టిన వెంటనే తల్లిదండ్రులకు ఇలా లక్షా తొంభై డౌట్లు.
- అప్పుడే పుట్టిన బిడ్డ విషయంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సంప్రదాయాలు,
- అపోహలు, నమ్మకాలు ఉంటాయి. ఇంతకీ బిడ్డ పుట్టిన వెంటనే ఏం చేయాలి?
- ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.
అ ప్పుడే పుట్టిన పిల్లల(నవజాత శిశువు) విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పుట్టిన తర్వాత కొన్ని వారాల వాటు వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. బేబీ కేర్ విషయంలో అవగాహన లేకపోవడం వల్లే పిల్లలకు అనేక సమస్యలు వస్తున్నాయి. అందుకే మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబర్15 నుంచి 21 వరకు నవజాత శిశువుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు నేషనల్ న్యూబోర్న్ కేర్ వీక్ (జాతీయ నవజాత సంరక్షణ వారం) నిర్వహిస్తున్నారు.
పుట్టిన తర్వాత..
తొమ్మిదినెలలు అమ్మ కడుపులో ఉన్న బేబీ దాదాపు 95 శాతం పూర్తిగా మెచ్యూర్ అయిన అవయవాలతో పుడుతుంది. పుట్టకముందు అమ్మ కడుపులోనే శిశువుకు కావాల్సిన నూట్రియెంట్స్ అందుతాయి. పుట్టిన శిశువు బయటి వాతావరణాన్ని తట్టుకోవాలంటే దాదాపు 2.5 కేజీల వరకు బరువు ఉండాలి. ఇలా ఉంటే హెల్దీ బేబీ అని అర్థం. అలాంటి పిల్లలకు రెండో రోజు నుంచే స్నానం చేయించొచ్చు. లేదా బొడ్డు ఊడిన తర్వాత అయినా చేయించొచ్చు. సాధారణంగా నాలుగైదు రోజుల్లో బొడ్డు ఊడిపోతుంది. అప్పుడు కాస్త బ్లడ్ రావడం మామూలే. దాన్ని కాటన్‌తో క్లీన్ చేస్తే సరిపోతుంది.
పుట్టగానే ఏడవాలి
‘పుట్టగానే ఏడవాలి’ అంటారు. దానికి కారణం.. మొదటి ఏడుపుతో అన్ని అవయవాలకు ఆక్సిజన్ చేరుతుంది. ఎలాగంటే.. పుట్టకముందు బేబీ ఊపిరితిత్తుల్లో ఉమ్మనీరు ఉంటుంది. పుట్టిన తర్వాత శిశువు ఏడవడంతో ఊపిరితిత్తుల్లో ఉన్న నీరంతా బయటకు వచ్చి, శ్వాసతో గాలి(ఆక్సిజన్) అందుతుంది. అది శరీరంలోని అన్ని అవయవాలకు వెళ్తుంది. అందుకనే ఏడుపు బాగుందా? లేదా? అని గమనిస్తారు.
చర్మం పింక్ కలర్లో..
అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చాక బేబీ చర్మం కాస్త పింక్ కలర్లో ఉంటుంది. ఆక్సిజన్ సప్లయ్ స్కిన్‌కి చేరడం వల్లే ఆ రంగులోకి మారుతుంది. ప్రతి అవయవానికి చేరిన తర్వాతే స్కిన్‌కి చేరుతుంది. పుట్టిన శిశువు చర్మం అప్పటివరకు ఉమ్మనీరులో ఉండడం వల్ల చాలా బాగుంటుంది. బయటికి వచ్చిన రెండుమూడు రోజులకు ముఖం నుంచి పొట్టవరకు ఎర్రటి పొక్కులు కనిపిస్తాయి. అవి చాలా సాధారణం. ఐదారు రోజుల్లో వాటంతటవే పోతాయి.
ఇలా బేబీ కలర్, కదలికలు, ఏడుపు.. వీటి ద్వారానే ఆరోగ్యంగా ఉందని నిర్ధారణకు రావొచ్చు. అన్నీ బాగుంటే వీలైనంత త్వరగా అమ్మ పాలు పట్టించాలి.
పాలు ఎలా పట్టించాలి?
మొదటిసారి కాన్పు అయినవాళ్లకు పాలు ఇచ్చే పొజిషన్ సరిగా కుదరక కొంత ఇబ్బంది పడుతుంటారు. ఆ తర్వాత అలవాటైపోతుంది. కానీ.. బేబీ పాలు తాగిన తర్వాత కొద్దిసేపు భుజాన వేసుకోవాలి. అలా కాకుండా వెంటనే పడుకోబెడితే కొందరు పాలను కక్కేస్తుంటారు.అప్పుడే పుట్టిన పిల్లలకు రెండు మూడు గంటలకు ఒకసారి కచ్చితంగా పాలు ఇవ్వాలి. అంటే రోజుకు కనీసం 8 నుంచి12 సార్లు పాలు తాగించాలి.
పాలు సరిపోతే..
పిల్లలు తాగేటప్పుడు ముందుగా నీళ్లలాగ ఉండే పాలు వస్తాయి. కొందరు వాటిని ‘ముందుపాలు’ అంటారు. వాటిని తాగడం వల్ల బేబీకి హైడ్రేషన్ అందుతుంది. దాంతో ఆకలిని అదుపు చేసుకోగలుగుతుంది. కానీ.. ఆకలి పూర్తిగా తీరదు. పాలు తాగుతూ అలాగే నిద్రలోకి జారుకుంటుంది. కానీ.. పదిహేను నిమిషాల్లో మళ్లీ నిద్ర లేస్తుంది. అలా ఎందుకు జరుగుతుందో చాలామందికి తెలియదు. అసలు విషయం ఏంటంటే.. పుట్టిన తర్వాత వారం లేదా పది రోజుల వరకు రెండు రొమ్ముల నుంచి పాలు ఇవ్వొచ్చు. పదిరోజుల తర్వాత మాత్రం ఒక్క రొమ్ముకే ఎక్కువసేపు పాలు ఇవ్వాలి. అంటే అరగంటపాటు ఒకవైపే ఇవ్వాలి. ఆ పాలు తాగిన బేబీ దాదాపు రెండు గంటలు పడుకుంటుంది. అలా పడుకుంటే బేబీకి సరిపడా పాలు అందినట్లే అని అర్థం. ఈ పాలను కొందరు ‘కిందపాలు’ అంటారు. నిద్ర విషయానికొస్తే.. సాధారణంగా పుట్టిన పిల్లలు16 నుంచి18 గంటలు నిద్రపోతారు.
యూరిన్ – మోషన్
మొదట్లో యూరిన్ తక్కువగా వెళ్తారు. ఆ తర్వాత క్వాంటిటీ పెరుగుతుంది. దాన్ని బట్టి బేబీకి పాలు ఎలా అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ యూరిన్ వెళ్తే ఎక్కువ పాలు తీసుకున్నట్టు. అలాగే మోషన్ విషయానికొస్తే.. రంగులో మార్పు ఉంటుంది. మొదట్లో నల్లగా, తర్వాత ఆకుపచ్చ, పసుపు కలిసిన రంగు నుంచి పసుపుగా మారుతుంది. పిల్లలు పాలు తాగగానే మోషన్‌కి వెళ్తారు. వాళ్ల పొట్ట కదలిక మనకన్నా చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. అయితే వాళ్లు ఆరు నుంచి ఎనిమిది సార్లు అరచేతంత మోషన్ వెళ్తే నార్మల్. అంతకంటే ఎక్కువ మోతాదులో, ఎక్కువసార్లు వెళ్తుంటే కచ్చితంగా డాక్టర్ దగ్గరకి వెళ్లాలి.
జాండిస్ రాకుండా..
తల్లి, బిడ్డ బ్లడ్ గ్రూపుల్లో మార్పులతోపాటు మరికొన్ని కారణాల వల్ల బేబీకి జాండిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మొదటిసారి జాండిస్ వచ్చాక రెండు, మూడు రోజులు తీవ్రత కాస్త తక్కువగా.. ఐదు, ఆరు రోజులు మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే.. అన్నింటికీ ట్రీట్మెంట్ ఏంటంటే తల్లి పాలు. పాలు సరిగ్గా ఇస్తే జాండిస్‌కు కారణమయ్యే బిలురుబిన్ యూరిన్లోనే కొట్టుకుపోతుంది.
నెలరోజులు ఇలా
చిన్నగా ఉన్నప్పటికీ బేబీకి మనకంటే చాలా రెట్లు చెమట పడుతుంది. దానికి కారణం వాళ్ల స్కిన్ లేయర్. వాళ్లలో బ్రౌన్ ఫ్యాట్ మిస్ అయి ఉంటుంది. దానివల్ల వాళ్ల బాడీ.. టెంపరేచర్ని మెయింటెయిన్ చేయాలి. క్లాత్‌లో చుట్టినప్పుడు వాళ్లు కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడు వేడి పుడుతుంది. అది కూడా బాడీకి పనికొస్తుంది. కాబట్టి ఎక్కువసేపు వాళ్లను కప్పి ఉంచాలి. బేబీ బరువును బట్టి కప్పాలా లేదా అర్థం అవుతుంది. దాదాపు నెలరోజులు చుడితే చాలా మంచిది. అలాగే పిల్లలు పుట్టిన వెంటనే తలకు క్యాప్ పెట్టాలని చెప్తుంటారు. దానికి కారణం.. బేబీ తల నుంచే వేడిని ఎక్కువగా కోల్పోతుంటుంది. కాబట్టి అలా పోకుండా ఉండేందుకు క్యాప్ అవసరం.
మసాజ్ మంచిదే
బేబీ బాడీకి ఆయిల్ మసాజ్ చేయాలి. కానీ, చెవుల్లో, ముక్కుల్లో నూనె వేయకూడదు. ముక్కులో నూనె వేస్తే అది ఊపిరితిత్తులకు వెళ్లి నిమోనియా వచ్చే ప్రమాదం ఉంది. చెవుల్లో పోస్తే కొన్నిసార్లు చీమలు, ఈగలు వంటివి ఇబ్బంది పెడతాయి. అప్పట్లో అమ్మమ్మలు బాడీకి నూనె రాస్తూ, ముచ్చట చెప్తూ లేదా పాటలు పాడుతూ మర్దన చేసేవాళ్లు. దానివల్ల బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది. ఎవరో పట్టుకున్నారు, మాట్లాడుతున్నారు అనేది తెలుస్తుంది. కాబట్టి ఏం జరుగుతుందోనని భయపడకుండా, మాట్లాడేది ఎవరా అని వెతుక్కోకుండా ఎదురుగా ఉన్న వాళ్లని చూస్తూ, మాటలు వింటూ ఉంటారు. ఇలా మెదడు పనితీరు మెరుగవుతుంది. కాబట్టి మసాజ్ చేయడం మంచిదే.
మరికొన్ని టిప్స్
సేఫ్టీ: అంటువ్యాధులు, బర్త్ ఇంజ్యురీస్ లాంటి వాటికి బిడ్డను దూరంగా ఉంచాలంటే సేఫ్ బర్త్ ఎన్విరాన్మెంట్ చాలా ముఖ్యం. కాబట్టి.. ప్రసవం టైంలో హైజీన్, స్కిల్డ్ మెడికల్ కేర్ కచ్చితంగా అవసరం.
తెలుసుకోవాలి: బిడ్డకు క్వాలిటీ కేర్ చాలా అవసరం. అందుకే బిడ్డ పుట్టిన వెంటనే పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్లను అడిగి తెలుసుకోవాలి. పిల్లలకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఎలా గుర్తించాలో తెలిసి ఉండాలి. సరైన టైంలో ట్రీట్మెంట్ చేయించాలి. ఫీడింగ్, స్కిన్–టు–స్కిన్ కాంటాక్ట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
టీకాలు: పిల్లలను హాని కలిగించే వ్యాధుల నుంచి రక్షించేందుకు మొదటి సంవత్సరంలో సరైన టైంలో టీకాలు వేయించాలి. కామెర్లు, ఇన్ఫెక్షన్లు, పుట్టుకతో వచ్చే లోపాలను తెలుసుకోవడానికి పిల్లల్ని గమనిస్తూ ఉండాలి.
చెకప్‌లు: బేబీ పుట్టాక అవసరాలను తీర్చడమే కాకుండా పుట్టకముందు నుంచే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రినేటల్ చెక్–అప్‌లు చేయించుకోవాలి. బిడ్డ పుట్టిన తర్వాత కూడా అప్పడప్పుడు డాక్టర్‌కి చూపించాలి.
- డాక్టర్ విఠల్ కుమార్ కసిరెడ్డి
కన్సల్టెంట్ పీడియాట్రిషియన్
కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్