కొత్త సంవత్సరం రాబోతోంది.. వచ్చే ఏడాదంతా సంతోషంగా ఉండాలని ఒకరికొకరం విష్ చేసుకుంటాం. అయితే, సంవత్సరం మొత్తం ఆనందంగా ఉండాలంటే తప్పనిసరిగా అవసరమైంది ఆరోగ్యం.
అవును.. ఒక్క ముద్దని అరాయించుకునే శక్తి లేకపోతే కోట్ల ఆస్తి ఉండి ఏం లాభం..? నాలుగు అడుగులు వేసే ఓపిక లేకుండా.. ఎంతటి పేరు, ప్రతిష్టలున్నా ఉపయోగం ఉండదు. అందుకే ఆరోగ్యానికి మించిన అదృష్టం లేదంటారు పెద్దలు. కొత్త సంవత్సరంలో మీరు రూపొందించుకునే తీర్మానాల్లో ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యం ఇవ్వబోతున్నారా..? అయితే కొన్ని తప్పనిసరిగా తినాలి. ఇంకొన్ని పూర్తిగా వదిలేయాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి కావాలంటే ఈ డైట్ రూల్స్ పాటించాలి..
తగినంత నిద్ర
తగినంత నిద్రలేకపోవడం అనారోగ్యానికి పునాది. చాలామంది ఆఫీస్, బిజినెస్ అంటూ పనిలో పడి నిద్రాహారాలు మానేస్తారు. దీనివల్ల తరచూ అనారోగ్యానికి గురవుతారు. అయితే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి. సరిపడా నిద్ర ఉంటేనే శరీరంతో పాటు మెదడుకి కూడా విశ్రాంతి ఎనర్జీ రీజనరేట్ అవుతుంది. అప్పుడు రెండు రెట్లు ఎక్కువగా పని చేయొచ్చు. అందుకే రోజులో సరిపడా నిద్ర పోవడం పక్కాగా ప్లాన్ చేసుకోవాలి.
వ్యాయామం
మనిషి బలంగా ఉండాలంటే రోజుకి ఇన్ని వేల అడుగులు వేయాలి. వారానికి ఇన్ని గంటలు వ్యాయామం చేయాలని డాక్టర్స్ చెబుతారు. అ లెక్కలన్నీ పక్కన పెడితే శరీరానికి చెమటపట్టేలా, కండరాలన్నీ కదిలేలా ఏదో ఒక వ్యాయామం చేయకపోతే ఉబకాయం గ్యారెంటీ. ఆ తర్వాత నానా రకాల జబ్బులన్నీ చుట్టు ముడతాయి. కాబట్టి రోజులో కనీసం అరగంటైనా వ్యాయామానికి సమయం కేటాయించాలి. షటిల్, జాగింగ్, వాకింగ్, స్వి మ్మింగ్.. లాంటివి ఉత్సాహాన్నిస్తాయి.
పరిశుభ్రమైన తాగునీరు
కిడ్నీలో రాళ్లు పడే వరకు శరీరంలో నీరు తగ్గిందని గమనించం. ఊబకాయం తగ్గాలన్నా చర్మం మెరవాలన్న కిడ్నిల్లో క్యాల్షియం లాంటి వ్యర్థాలు పేరుకోకుండా ఉండాలన్నా, కండరాలు బలంగా ఉండాలన్న ఆఖరికి గొంతులో కఫం కరగాలన్నా తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. అయితే, కలుషిత నీటి వల్లే ఎనభై శాతం వరకూ అనారోగ్యాలు వెంటాడతాయి. తాగుతున్న నీళ్లుమంచివేనా? కాదా? అన్నది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.
ALSO READ : New Year Special : 2025లో వీటిని గట్టిగా అనుకోండి.. చేసుకునే తీర్మానాలను లైట్ తీసుకోవద్దు.. !
ఎక్కడబడితే అక్కడ దొరికేనీటిని -తాగితే సమస్యలు తప్పవు. అందువల్ల తాగే నీటి విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి.. ఇంట్లో ఫిల్టర్లు వాడాలి. బాగా మరిగించి చల్లార్చిన నీటిని వాడటం అవసరం. బయటికి వెళ్లిన ప్పుడు ఇంటి నుంచే మంచినీళ్లు తీసుకువెళ్లాలి. తగినన్ని మంచినీళ్లు తాగడం వల్ల శరీరంలో ఉండే మలినాలను జీర్ణవ్యవస్థ ఎప్పటికప్పుడు బయటికి పంపేస్తుంది. అలా జరగడంలో తేడా వస్తే రకరకాల అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, కాలేయ సమస్యలు తప్పవు.
మానసిక ఒత్తిడికి దూరం
ప్రపంచం పరుగులు తీస్తోంది. దాంతో పాటు మనం కూడా పరుగులు తీయాల్సిందే. వెనకబడలేం కదా. అయితే, అన్ని వయసుల వారు ప్రస్తుత ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య మానసిక ఒత్తిడి. ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో ఒత్తిడి ఉంటుంది. సమస్యను ఏ దృష్టితో చూస్తున్నావనేదాన్ని బట్టి ఒత్తిడి ఉంటుంది. కొందరు చిన్న సమస్యలను కూడా అదే పనిగా భూతద్దంలో చూసుకోవడం, లేని దానిని కూడా ఊహించుకుని ఒత్తిడికి లోనవుతుంటారు. వాళ్ల ప్రవర్తన ఇంట్లో వాళ్లతో పాటు ఫ్రెండ్స్, సహా ద్యోగులపై కూడా ప్రభావం చూపిస్తుంది.
ALSO READ : Happy New year 2025: కొత్తసంవత్సరం రోజు గుడికి ఎందుకు వెళ్లాలో తెలుసా..
చాలామంది ఒత్తిడి పోతుందనే అపోహతో సిగరెట్ మందు లాంటివి అలవాటు చేసుకుంటారు. ఈ అలవాట్ల వల్ల ఒత్తిడి ఏ మాత్రం తగ్గదు. ఆఫీసులో పని భారంగా ఉంటే తోటి ఉద్యోగులతో షేర్ చేసుకోవాలి. కాస్త సమయం తీసుకోవాలి. పూర్తి చేయాల్సిన పనికి తగిన సమయం లేకపోతే ఎవరైనా సరే కాస్త ఒత్తిడికి లోనవడం సహజం. ఒత్తిడి నుంచి బయటపడటం అలవాటు చేసుకుంటే మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా ఆరోగ్యం బాగుంటుంది.
పోషకాహారం తప్పనిసరి
చాలామందికి కేవలం నోటికి రుచినిచ్చేది, కడుపునింపేది మాత్రమే మంచి ఆహారం అనే అభిప్రాయం ఉంటుంది. ఇందులో నిజం లేదు. శరీరానికి ఉపయోగపడే పోషణాలున్న ఆహారమే ఆరోగ్యాన్ని ఇస్తుంది. తీసుకునే ఆహారం తాజాగా ఉండాలి. నిల్వ చేసిన ఆహార పదార్థాల వల్ల ఆరోగ్యానికి నష్టం. నిత్యం ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చేపలు, గుడ్లు లాంటివి తీసుకోవాలి. అలాగే తక్కువ చేసిన పదార్ధాలు, పొట్టు తీయని ధాన్యాలు, గింజలు, పప్పులు తినాలి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, కెరొటినాయిడ్స్ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
ఒక్కసారే కడుపులో పట్టనంత తినడం కంటే.. వీలైనంత వరకు అంటే రోజుకు నాలుగైదుసార్లు పరిమితంగా తినడం అవసరం. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతామని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. మితిమీరిన నూనెలు, మసాలాలు సాధ్యమైనంతవరకు దూరంగా ఉండటం బెటర్. అలాగే లోఫ్కాట్, మెడిటరేనియన్, పాలియో, వీగన్ మొదలైన డైట్స్ ఫాలో అయితే అసలు చిక్కే ఉండదు.