వేలంలో రూ.140 కోట్లు పలికిన టిప్పు సుల్తాన్ ఖడ్గం

18వ శతాబ్దపు మైసూర్ చక్రవర్తి టిప్పు సుల్తాన్ ఉపయోగించిన ఖడ్గం వేలంలో భారీ ధర పలికింది. సుమారు రూ.140 కోట్ల‌కు అమ్ముడుపోయినట్లు వేలం నిర్వహించిన బాన్‌హ‌మ్స్ హౌజ్  వెల్ల‌డించింది. అంచ‌నా వేసిన దాని క‌న్నా ఏడు రెట్లు ఎక్కువ ధ‌ర‌కు అమ్ముడుపోయిన‌ట్లు తెలిపింది. 18వ శ‌తాబ్ధంలో ఎన్నో యుద్ధాల‌ను గెలిచిన టిప్పు సుల్తాన్ ఈ ఖ‌డ్గాన్ని వాడిన‌ట్లు ఆధారాలు ఉన్నాయని బాన్‌హ‌మ్స్ పేర్కొంది. 

టిప్పు సుల్తాన్ 1175 నుంచి 1779 వరకూ మరాఠాలపై యుద్ధం చేశాడు. ఆ యుద్ధాల్లో ఈ ఖడ్గాన్ని వాడినట్టు బాన్‌హ‌మ్స్ చెప్తోంది. ఈ ఖడ్గాన్నిటిప్పు సుల్తాన్ మరణానంతరం అతని బెడ్ ఛాంబర్‌లో కనుగొన్నారు. టిప్పు సుల్తాన్‌ హత్యకు గురైన తరవాత ఖడ్గాన్ని బ్రిటీష్ మేజర్ జనరల్ డేవిడ్ బెయిర్డ్‌గి అప్పగించినట్లు ఆక్షన్ హౌజ్ ధ్రువీకరించింది. చరిత్రకు సంబంధించి ఇప్పటి వరకూ అత్యంత అద్భుతంగా తయారైన ఖడ్గాల్లో ఇది ఒకటి. చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతేకాదు.. టిప్పు సుల్తాన్ వాడిన ఆయుధాల్లో ఇది చాలా కీలకమైంది. అందుకే దీనికి అంత డిమాండ్. ఖడ్గాన్ని దక్కించుకోవడానికి బిడ్డర్స్‌ పోటాపోటీగా వేలంలో పాల్గొన్నారు. చివరికి  రూ.140 కోట్ల వద్ద వేలం ముగిసింది. 

టిప్పు సుల్తాన్‌ను 'టైగర్ ఆఫ్ మైసూర్‌' అని పిలుస్తుంటారు. అతడు అత్యంత ధైర్య‌సాహసాలు కలవాడని, త‌న సామ్రాజ్యాన్ని ర‌క్షించుకోవడంలో ఎన్నో యుద్ధాలు చేసినట్లు చరిత్ర చెప్తోంది. అయితే సైనికులు మోసం చేయడంతో టిప్పు సుల్తాన్‌ మరణం సాధ్యమైందని చరిత్ర పుటల్లో ఉంది. టిప్పు సుల్తాన్‌ మేని ఛాయతో నల్లగా, తక్కువ ఎత్తు, కళ్లు పెద్దవిగా ఉండేవని.. ప్రసిద్ధ చరిత్రకారుడు కల్నల్‌ మార్క్‌ విల్క్‌ ఓ పుస్తకంలో వివరించారు.