తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదాలు జరుగకుండా టీటీడీ అనేక చర్యలు తీసుకుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల కొండకు వెళ్లే మార్గంలో
తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో... భక్తుల భద్రత దృష్ట్యా అలిపిరి చెక్ పోస్ట్ వద్ద వాహనాల ఫిట్ నెస్ను తనిఖీ చేసి కొండకు అనుమతించాలని అధికారులను ఆదేశించారు. తిరుమలకు వచ్చే ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి అధునాతన యంత్ర పరికరాలను ఏర్పాటు చేయాలని సివీఎస్వోను ఆదేశించారు. తిరుమలకు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు తీసుకెళ్లకుండామరింత పటిష్టంగా తనిఖీలు చేయాలని విజిలెన్స్ సిబ్బందికి సూచించారు. వాహనాల తనిఖీ ఆలస్యం కాకుండా ఉండేందుకు క్యూ లైన్ల సంఖ్యను పెంచనున్నట్లు చెప్పారు.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ట్రాఫిక్ లో చిక్కుకోకుండా శ్రీనివాస సేతు నిర్మాణానికి టీటీడీ 65 శాతం నిధులు అందిస్తోందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గత ఏడాది డిసెంబర్లోనే ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తికావాల్సి ఉన్నా... కొన్ని సాంకేతిక కారణాలవల్ల ఆలస్యమైందన్నారు. జూన్ నెల చివరకు పనులు పూర్తి చేసి జులై లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. గాలి గోపురం దగ్గర దివ్య దర్శనం టోకెన్ల స్కానింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన... భక్తుల కోసం గ్లోబల్ ఆసుపత్రి నిర్వహిస్తున్న వైద్య కేంద్రాన్ని పరిశీలించారు.
2022 డిసెంబర్లో చేపట్టిన చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ ఏడాది చివర్లో ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆస్పత్రి ప్రారంభిస్తామని చెప్పారు.