తిరుమల బ్రహ్మోత్సవాలు : శ్రీవారికి ఏకాంత సేవ ఎంతసేపు.. విరామం ఎందుకిస్తారు..?

తిరుమల బ్రహ్మోత్సవాలు : శ్రీవారికి ఏకాంత సేవ ఎంతసేపు.. విరామం ఎందుకిస్తారు..?

వెలుగు:  అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వేంకటేశ్వరస్వామికి ప్రతి రోజూ ఆరుసార్లు పూజలు చేస్తారు. స్వామిని ఉదయం మూడు గంటలకే  మేలుకొలిపి.. రాత్రి ఒంటి గంటకు పవళింపజేసే వరకు ఈ పూజలుంటాయి. వీటినే ఆగమంలో 'షట్కాల పూజలు' అంటారు. 

వాటిలో ఏకాంత సేవ మాత్రం ఏడాదిలో పదకొండు నెలలు వేంకటేశ్వరస్వామికి చేసి, ఒక నెల శ్రీకృష్ణుడికి చేస్తారు.తిరుమల వేంకటేశ్వరస్వామికి వైఖానస ఆగమోక్తంగా రోజుకు ఆరుసార్లు పూజలు చేస్తారు. దీన్నే ఆగమ పరిభాషలో 'షట్కాల పూజ' అంటారు.షట్కాలాలు అంటే ప్రత్యూష, ప్రాతఃకాల, మధ్యాహ్న అపరాహ్న, సాయంకాల, రాత్రి వేళలు. సుప్రభాత సేవతోమొదలయ్యే ఈ పూజలు ఏకాంత సేవతో ముగుస్తాయి. 

ఏకాంత సేవతో విరామం

క్షణం తీరిక లేకుండా ప్రతిరోజు భక్తులకు దర్శనమిచ్చే స్వామికి అర్థరాత్రి తర్వాత ఒంటి గంటకు పవళింపు సేవ చేస్తారు. దీనినే 'ఏకాంత సేవ' అని కూడా అంటారు. ముఖమంటపంలో రెండు వెండి గొలుసులతో కట్టిన ఊయలలో భోగ శ్రీనివాసమూర్తిని శయనింపచేసి పాలు, పళ్లు, బాదం పప్పు నైవేద్యంగా పెడతారు. రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు వచ్చే బ్రహ్మదేవుని కోసం తగినంత నీటిని వెండి గిన్నెల్లో ఉంచుతారు. 

ఏడుకొండలవాడిని నిద్రపుచ్చేందుకు అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు. ఇది తాళ్లపాక వారి లాలిగా ప్రసిద్ధి పొందింది. ఈ ఏకాంత సేవ ఏడాదిలో 11 నెలల పాటు భోగశ్రీనివాసుడికి, ధనుర్మాసంలో శ్రీకృష్ణుడికి చేస్తారు. ఏకాంత సేవతో ఆ రోజు చేసే పూజలన్నీ ముగుస్తాయి. రాత్రి రెండు గంటలకు గుడి మూసే ప్రక్రియ మొదలవుతుంది. ముందు మూడో ద్వారాన్ని, ఆ తర్వాత బంగారు వాకిలిని మూసేసి లోపలి గడియలు వేస్తారు. అధికారులు బయటివైపు తాళాలు వేసి వాటిపై సీలు వేసే సంప్రదాయం అనాది కాలం నుంచి వస్తోంది.

V6 వెలుగు