తిరుమలలో పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 16 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. సెప్టెంబర్ 18న శ్రీవారిని 62,745 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన మొక్కుల ద్వారా స్వామి వారికి రూ . 3.10 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 19 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. స్వామివారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. SSD / DD టైమ్ స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం పట్టగా.. స్వామివారి ప్రత్యేక రూ. 300 దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. అలాగే శ్రీవారి స్పెషల్ దర్శన్ టికెట్ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారికి 24,451 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

ALSO READ:  యాదాద్రిలో భక్తుల రద్దీ సాధారణం.. హుండీ ఆదాయం ఎంతంటే..

మరోవైపు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో.. సెప్టెంబ‌రు18 నుంచి 26 వ‌ర‌కు, అక్టోబ‌రు 15 నుంచి 23వ‌ర‌కు అష్టద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌, తిరుప్పావ‌డ‌, క‌ళ్యాణోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, స‌హ‌స్ర దీపాలంకార సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. 

అయితే ముంద‌స్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్ చేసుకున్న భ‌క్తుల‌ను మాత్రమే నిర్దేశిత వాహ‌న‌సేవ‌కు అనుమ‌తిస్తారని వెల్లడించింది. అలాగే న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల అంకురార్పణ వల్ల అక్టోబ‌రు 14న స‌హ‌స్రదీపాలంకార సేవ‌ను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.