![Tirumala Alert : నడక దారిలో పులి.. గుంపులు గుంపులుగా కొండెక్కుతున్న భక్తులు](https://static.v6velugu.com/uploads/2025/02/tirumala-devotees-walking-from-alipiri-in-groups_RAzhxaWboy.jpg)
తిరుమల భక్తులను టీటీడీ అలర్ట్ చేసింది. కలియుగదేవుడు.. ఏడుకొండలస్వామిని దర్శించుకునేందుకు చాలామంది భక్తులు అలిపిరి మార్గం నుంచి నడుచకుంటూ.. ఏడుకొండలవాడా.. వెంకట రమణా.. గోవిందా.. అంటూ వెళుతుంటారు. కొంత కాలంగా ఈ మార్గంలో చిరుతపులుల సంచారంతో భక్తులు భయపడుతూ వెళుతున్నారు. మళ్లీ ఇప్పుడు చిరుత సంచారం చేస్తుందని గుర్తించిన టీడీటీ అధికారులు నడక మార్గంలో వెళ్లే భక్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
తిరుపతి, తిరుమల పరిధిలో చిరుతల సంచారం నేపథ్యంలో టీటీడీ అధికారులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. అలిపిరి నుంచి నడక మార్గంలో స్వామిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులను గుంపులు..గుంపులుగా అనుమతిస్తున్నారు. చిరుత సంచారాన్ని గుర్తించిన టీడీటీ అధికారులు విజిలెన్స్ అధికారుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read:-హైదరాబాద్ నుమాయిష్ కు 46 రోజుల్లో 17లక్షల 46 వేల మంది..
అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులను ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు యథావిధిగా అనుమతిస్తున్నారు. రెండు గంటల దాటిన తరువాత గుంపులు.. గుంపులుగా పంపిస్తున్నారు. ఒక్కో గ్రూపునకు 70 నుంచి 100 మంది ఉండేలా టీడీడీ విజిలెన్స్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. రెండు గంటలు దాటిన తరువాత నడక మార్గంలో 12 సంవత్సరాలలోపు పిల్లలకు నో ఎంట్రీ అని టీడీడీ ప్రకటించింది. అలాగే రాత్రి 9.30 గంటల తరువాత అలిపిరి నడక మార్గాన్ని మూసివేయనున్నారు. చిరుత సంచారంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని టీటీడీ తెలిపింది.