తిరుమలలో నకిలి ఐఏఎస్ అధికారి : ఫేక్ లెటర్ తో దొరికిన కేటుగాడు

తిరుమలలో నకిలీ ఐఏఎస్‌ అధికారి నరసింహారావును టీటీడీ  విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జాయింట్‌ సెక్రటరీ హోదాలో శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనానికి ఆయన సిఫార్సు లేఖ సమర్పించారు. అతడి వైఖరిపై అనుమానంతో ఈవో కార్యాలయ సిబ్బంది విజిలెన్స్‌ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు నరసింహారావును అదుపులోకి తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో విజయవాడ, గుంటూరులోనూ ఆయన ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.

తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నరసింహారావు అనే వ్యక్తి నకిలీ ఐఏఎస్‌గా అవతారమెత్తాడు.. గురువారం ( ఏప్రిల్ 11)  స్వామివారి దర్శనానికి తిరుమలకు వచ్చాడు. తాను ఐఏఎస్‌ అధికారినంటూ టీటీడీ ఈవో కార్యాలయంలో సిఫార్సు లేఖను అందించాడు. తాను జాయింట్‌ సెక్రటరీగా పనిచేస్తున్నానని చెప్పుకొచ్చాడు. అతడు ఇచ్చిన లేఖను క్షుణ్ణంగా పరిశీలించిన ఈవో కార్యాలయ అధికారులు అనుమానించి అతడిని ప్రశ్నించారు. అయితే నరసింహారావు తడబడటంతో పాటుగా అతడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అతడి వైఖరిపై అనుమానం వచ్చింది.
  
వెంటనే ఈవో కార్యాలయ సిబ్బంది విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు ఆరా తీసి.. నకిలీ ఐఏఎస్ అధికారి నరసింహారావుపై పోలీసులకు టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేయగా.. వారు అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా గుంటూరు, విజయవాడలో కూడా ఇదే తరహాలో నరసింహారావు మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. నరసింహారావుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.